Man Eater Wolves: నరమాంస భక్షక తోడేళ్లు.. నెలన్నరలో 8 మంది బలి

by Julakanti Pallavi |
Man Eater Wolves: నరమాంస భక్షక తోడేళ్లు.. నెలన్నరలో 8 మంది బలి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో నరమాంస భక్షక తోడేళ్లు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా బహ్‌రయీచ్ జిల్లాలో ఓ 2 ఏళ్ల చిన్నారిని ఎత్తుకుపోయి అత్యంత కిరాతకంగా హతమార్చాయి. హరిది ప్రాంతంలోని గరేఠీ గురుదత్త సింగ్ గ్రామంలో ఆదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ 2 రెండేళ్ల చిన్నారిని తోడేలు ఎత్తుకుపోయింది. అనంతరం రెండు చేతులూ లేని మృత శరీరం గ్రామానికి కిలోమీటరు దూరంలో అడవిలో లభించింది.

ఈ ఘటనపై బహ్‌రయీచ్ జిల్లా మెజిస్ట్రేట్ మోనికా రాణి స్పందిస్తూ.. గత కొద్ది నెలలుగా తోడేళ్ల దాడులు ఎక్కువయ్యాయని, జూలై 17 నుంచి ఇప్పటివరకు 8 మందిని రాక్షస తోడేళ్లు పొట్టన పెట్టుకున్నాయని అన్నారు. అలాగే తోడేళ్ల దాడిలో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఇప్పటికే 16 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించడం జరిగిందని, ఈ అధికారులంతా షిప్టుల వారీగా రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారని తెలిపారు.

తోడేళ్ల స్వైర విహారం నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి తలుపులు వేసుకుని లోపలే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.

కాగా.. జిల్లాలోని హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 30 గ్రామాల్లో తోడేళ్ల దాడి ఘటనలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇక ఈ తోడేళ్లను పట్టుకోవడంలో బహ్రైచ్ అటవీ శాఖ బృందం విఫలం కావడంతో.. వారికి తోడుగా ఇప్పుడు శ్రావస్తి, బారాబంకి, లక్నో అటవీ శాఖ బృందాలు కూడా రంగంలోకి దిగాయి.

Advertisement

Next Story

Most Viewed