నేతాజీ జయంతి జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి: మమతా

by Disha Newspaper Desk |
నేతాజీ జయంతి జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి: మమతా
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి తీవ్రవ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెడితే బాధ్యత తీరినట్లు కాదని ఆరోపించారు. నేతాజీ జయంతి రోజును దేశమంతా సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్రధాని మోడీ ఆదివారం ఉదయం నేతాజీ నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనిని ఉద్దేశించి దీదీ తాజాగా వరుస ట్వీట్లలో విమర్శలకు దిగారు. నేతాజీ మరణించిన తేదీ పై ఇప్పటికే స్పష్టత లేదన్నారు. 'మాకు ఇప్పటికీ నేతాజీకి ఏం జరిగిందో తెలియదు. ఇది ఇంకా మిస్టరీగానే ఉంది. దీనికి సంబంధించిన ఫైళ్లను బయటపెడతామని ప్రభుత్వం ప్రకటించింది.

మేము నేతాజీకి సంబంధించిన ఫైళ్లను డిజిటలైజ్ చేసి, వర్గీకరించాము' అని అన్నారు. మమతా బెనర్జీ నేతాజీ పేరు మీద ఒక విశ్వవిద్యాలయాన్ని, ఇండియన్ నేషనల్ ఆర్మీ జ్ఞాపకార్థం ఒక స్మారకాన్ని కూడా ప్రకటించారు. ఆయన దేశభక్తి, ధైర్యం, నాయకత్వం, ఐక్యతతో పాటు సోదరభావానికి ప్రతిరూపమని అన్నారు. నేతాజీ తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు నేతాజీ సేవలను గుర్తు చేస్తూ నివాళులు ఆర్పించారు. కాగా కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ శకటాన్ని రిపబ్లిక్ వేడుకలకు కేంద్రం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ శకటాన్ని అదే రోజున కోల్‌కతా‌లో పరేడ్ వేడుకల్లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed