Maharashtra Polling: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో పోలింగ్ ప్రశాంతం.. పోలింగ్ శాతం ఎంతంటే?

by Mahesh Kanagandla |
Maharashtra Polling: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో పోలింగ్ ప్రశాంతం.. పోలింగ్ శాతం ఎంతంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర(Maharashtra Elections)లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్(Polling) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 58.22 పోలింగ్ శాతం(సాయంత్రం 5 గంటల వరకు) నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ముంబయి, పూణె, థానే నగరాల్లో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 61.74 శాతం పోలింగ్(Polling Percentage) నమోదైంది. జార్ఖండ్ రెండో విడతలో భాగంగా బుధవారం 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. పోలింగ్ శాతం ఇక్కడ గతం(67.04 శాతం)లో కంటే మెరుగుపడి 67.59 శాతంగా(సాయంత్రం 5 గంటల వరకు) నమోదైనట్టు ఈసీ తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మహారాష్ట్రలోని గడ్చిరోలి, జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు క్యూకట్టారని వివరించింది. రెండు అసెంబ్లీలతోపాటు బుధవారం నాలుగు రాష్ట్రాల్లోని 15 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి ఉపఎన్నికలు కూడా పూర్తయ్యాయి. నవంబర్ 13న 31 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలు కూడా కలుపుకుని మొత్తంగా 15 రాష్ట్రాలకు సంబంధించిన 48 అసెంబ్లీ స్థానాలకు, రెండు పార్లమెంటు(వయనాడ్, నాందేడ్) స్థానాలకు ఉపఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఓటర్లను ప్రభావితం చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ప్రకటించిన ఈసీ.. గతంలో కంటే ఈసారి ఎక్కువ నగదు పట్టుకున్నామని వివరించింది. రెండు రాష్ట్రాల్లో 914.18 కోట్లు(గతంలో కంటే 7.5 రెట్లు అధికం) సీజ్ చేసినట్టు తెలిపింది. బైపోల్స్ కూడా కలుపుకుంటే షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మొత్తం రూ. 1139 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.


ప్రిసైడింగ్ అధికారి తొలగింపు:

మహారాష్ట్రలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల మహాయుతి, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీల మహా వికాస్ అఘాడీలు ఈ ఎన్నికల కోసం విస్తృత ప్రచారం చేయగా.. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, నానా పటోలే, నవాబ్ మాలిక్, ఆదిత్య ఠాక్రే, జీషన్ సిద్దిఖీ, మిలింద్ డియోరాలు వంటి కీలక నేతల భవితవ్యాన్ని ఈవీఎలలో ఓటర్లు నిక్షిప్తం చేశారు. సచిన్ టెండూల్కర్, యాక్టర్ రాజ్ కుమార్ రావు, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు ప్రముఖులు కుటుంబాలతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇతరులనూ ప్రోత్సహించారు. ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేపట్టినా నగరాల్లో ఓటింగ్ శాతం మెరుగుపడలేదు. కాగా, ముంబయి నగరానికి చెందిన 113 ఏళ్ల కాంచన్‌బెన్ బాద్షా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. జార్ఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరగ్గా.. ధన్‌బాద్ జిల్లా ఝారియాలోని పోలింగ్ బూత్‌ వద్ద బుర్ఖా వివాదం రాజుకుంది. ఓటరు గుర్తింపు కోసం బుర్ఖాలు తొలగించాలని ఎన్నికల సిబ్బంది అడగ్గా చాలా మంది మహిళలు అందుకు నిరాకరించారు. పలువురు మహిళలు ఓటర్ స్లిప్పులు చించేశారు. సెక్యూరిటీ బలగాలు గొడవను సద్దుమణిగించాయి. మధుపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి కేసు నమోదైంది. ఆ అధికారిని ఈసీ తొలగించింది.

స్వతంత్ర అభ్యర్థికి గుండెపోటు, మరణం:

మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే గుండెపోటుతో మరణించారు. బాలాసాహెబ్ ఛత్రపతి షాహూ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఎన్నికల తీరును పర్యవేక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఛత్రపతి శంభాజీ నగర్‌ ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్లో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో అభ్యర్థి మరణిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 52 ప్రకారం ఆ సీటు ఓటింగ్‌ను వాయిదా వేయొచ్చు.

యూపీలో ఏడుగురు పోలీసులు సస్పెండ్

పోలీసులు చట్ట విరుద్ధంగా ఓటర్ల ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులను తనిఖీలు చేస్తున్నారని, ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెంటనే బాధ్యులైన ఏడుగురు పోలీసులు అధికారులను సస్పెండ్ చేసే చేసే నిర్ణయం తీసుకున్నారు. కాన్పూర్‌లో ఇద్దరు, మొరదాబాద్‌లో ముగ్గురు, ముజఫర్‌నగర్‌లో ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు.

Advertisement

Next Story

Most Viewed