Maharashtra: ‘మహా’ సీఎం కుర్చీపై ఉత్కంఠ.. ఫడ్నవీస్, షిండే మధ్యే తీవ్ర పోటీ!

by vinod kumar |
Maharashtra: ‘మహా’ సీఎం కుర్చీపై ఉత్కంఠ.. ఫడ్నవీస్, షిండే మధ్యే తీవ్ర పోటీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(Shivasena), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)లతో కూడిన మహాయుతి కూటమి (Mahayuthi Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 288 సీట్లకు గాను 233 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి పదవికి ప్రస్తుత సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే (Eknath shinde), బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavees), మరో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌(Ajith pawar)లు పోటీ పడుతున్నారు. కానీ ఫడ్నవీస్, షిండేల మధ్యే తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సీఎం పదవిపై ఆశపెట్టుకోగా, షిండే సైతం ఎంతో ఆతృతగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం సీఎం పదవిపై ఆశపెట్టుకున్న ముగ్గురు నేతలూ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ హైకమాండ్‌తో భేటీ తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు !

ప్రస్తుతం రాష్ట్రంలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. దీంతో ఈ ఫార్ములానే కంటిన్యూ చేయాలని మహాయుతి అగ్రనేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమిలో ప్రతి 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అనే ఫార్ములా ఖరారైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం.. బీజేపీకి 22 నుంచి 24 మంది, శివసేనలో10 నుంచి 12, అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి 8 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది. అయితే సీఎం పదవి పేరు ఈరోజే ఖరారవుతుందని, ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం ప్రమాణ స్వీకారం ఉండనున్నట్టు సమాచారం.

పట్టువీడని షిండే?

సీఎం పదవిపై ఏక్ నాథ్ షిండే పట్టువీడటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే మహాయుతి కూటమి గతంలో షిండే నాయకత్వంలోనే ప్రభుత్వాన్ని నడిపింది. షిండే ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బహిన్ పథకం విజయంలో కీలక పాత్ర పోషించింది. అటువంటి పరిస్థితిలో కూటమి విజయవంతంగా అధికారంలోకి వచ్చిన తరువాత షిండే తన వాదన బలంగా వినిపిస్తున్నట్టు సమాచారం. అయితే ఫలితాల అనంతరం షిండే మాట్లాడుతూ.. ఎక్కువ సీట్లు వచ్చిన వారే సీఎం అవుతారని ఎన్నికలకు ముందు నిర్ణయించుకోలేదన్నారు. షిండే ప్రకటన చూస్తుంటే సీఎం పదవిని వదులుకోవడానికి ఆయన ఇంట్రస్ట్ చూపడం లేదని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పదవిపై ఆసక్తి నెలకొంది. బీజేపీ మరోసారి షిండేకు అవకాశం ఇస్తుందా లేక తమ వద్దే సీఎం పోస్టును ఉంచుకుంటుందా వేచి చూడాల్సిందే.

ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా అజిత్

ముంబై (Mumbai)లోని దేవగిరి బంగ్లాలో ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో అజిత్ పవార్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలంగా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అజిత్ సహచరుడు అనిల్ పాటిల్‌ (Anil patil)ను మళ్లీ చీఫ్‌విప్‌గా నియమించారు. అలాగే బాంద్రాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ఏక్ నాథ్ షిండే సమావేశమయ్యారు. ఫడ్నవీస్ సైతం బీజేపీ కోర్ కమిటీ భేటీ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. కాగా, నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో వీలైనంత త్వరగా సీఎం పేరు ఖరారయ్యే చాన్స్ ఉంది.

Advertisement

Next Story

Most Viewed