ఎన్నికల వేళ.. జడ్జీలు, లాయర్లకు సీజేఐ కీలక సూచనలు

by Hajipasha |
ఎన్నికల వేళ.. జడ్జీలు, లాయర్లకు సీజేఐ కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో అందరితో పాటు న్యాయవ్యవస్థలో సేవలందిస్తున్న వారికీ రాజకీయ భావజాలాలు ఉంటాయని చెప్పారు. అయితే విధేయత చూపించే విషయంలో జడ్జీలు, లాయర్లు తమ రాజకీయ భావజాలాలను పక్కన పెట్టి.. కోర్టులు, రాజ్యాంగానికే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సీజేఐ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగిస్తూ సీజేఐ డీవై చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలకు అతీతంగా పక్షపాత రహితంగా పనిచేసే గొప్ప ఉద్దేశంతో న్యాయవ్యవస్థ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, బార్ అసోసియేషన్ స్వేచ్ఛ అనేవి అవినాభావ సంబంధం కలిగిన కీలకమైన అంశాలని చెప్పారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఎన్నో విచారణలు, చట్టపరమైన విశ్లేషణలు, రాజ్యాంగ సూత్రాల పరిశీలన తర్వాత తీర్పులను ఇస్తుంటాయన్నారు. ‘‘కోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన తర్వాత అది ప్రజల ఆస్తి అవుతుంది. ఆయా తీర్పులపై మీడియా, పొలిటికల్ కామెంట్రీ, సోషల్ మీడియాలలో ప్రశంసలు, విమర్శలు వస్తుంటాయి. ఆ రెండింటినీ స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని సీజేఐ స్పష్టం చేశారు. అయితే బార్ అసోసియేషన్‌ల సభ్యులుగా న్యాయవాదులు కోర్టుల తీర్పులపై ఇష్టానుసారంగా స్పందించకూడదని సూచించారు. కోర్టు తరఫున బాధ్యతాయుతంగా మాట్లాడాలని కోరారు.

Advertisement

Next Story