వ్యాక్సిన్ తీసుకుంటే లాటరీ టికెట్... తగిలితే జాక్ పాటే

by Disha News Desk |
వ్యాక్సిన్ తీసుకుంటే లాటరీ టికెట్... తగిలితే జాక్ పాటే
X

వియన్నా: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసి తమ ప్రజలందరికీ రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో వారికి వ్యాక్సిన్ అందించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారం గా మారుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు టీకా కొంటే ఇన్సెంటివ్‌లు ఇస్తుండగా, మరి కొన్ని దేశాల్లో టీకా వేసుకుంటే బీరు ఉచితం లాంటి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రజలను వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెంచేందుకు ఆస్ట్రియా కూడా ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

ఆస్ట్రియాలో 72 శాతం జనాభా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకుంది. వ్యాక్సినేషన్ పరంగా చూస్తే పశ్చిమ యూరప్‌లో అతి తక్కువ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న దేశంగా ఆస్ట్రియా నిలిచింది. దీంతో ఎలాగైనా వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకునే వారికి డోసుకు ఒకటి చొప్పున ప్రతి ఒక్కరికి మూడు లాటరీ టికెట్లు ఇవ్వనున్నట్టు ఆ దేశ చాన్స్‌లర్ కార్ల్ నెహమర్ తెలిపారు. ప్రతి పదవ టికెట్‌కూ 500ల యూరోలు బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. మొత్తంగా 1 బిలియన్ యూరోలను బహుమతులుగా ఇవ్వనున్నట్టు తెలిపారు. వీటిని హాస్పిటాలిటీ, టూరిజం, స్పోర్ట్స్, రిటైల్ లాంటి పలు రంగాల్లో ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కాగా ప్రభుత్వ ఆలోచనపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story