MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సమన్లు

by Mahesh Kanagandla |
MUDA Scam: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా/MUDA)కి చెందిన భూకేటాయింపు వివాదం(Land Allotment Scam) హీటెక్కుతున్నది. ఈ కేసులో నవంబర్ 6వ తేదీన విచారణకు హాజరవ్వాలని లోకాయుక్తా పోలీసులు సోమవారం సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు సమన్లు జారీ చేశారు. ఇది వరకే ఈ కేసు దర్యాప్తులో సిద్ధరామయ్య సతీమణి పార్వతి బీఎంను చేర్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27వ తేదీన లోకాయుక్తా పోలీసులు ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, ఆయన బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజు పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దేవరాజు నుంచి మల్లికార్జున్ స్వామి భూమి కొనుగోలు చేసి పార్వతికి గిఫ్ట్ ఇచ్చారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చుతుండటంతో అవకతవకలపై మరింత స్పష్టత కోసం లోకాయుక్తా పోలీసులు సీఎం సిద్ధరామయ్యనూ విచారించడానికి నిర్ణయించారు. మైసూరు ల్యాండ్ స్కామ్‌లో మనీ లాండరింగ్ కోణంలో 2020 నుంచి 2022 ముడా కమిషనర్‌గా పని చేసిన డీబీ నటేశ్‌లను ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత నటేశ్‌ను కస్టడీకి తీసుకున్నారు. నటేశ్ తన హయాంలో 14 సైట్లను సిద్ధరామయ్య భార్య పార్వతికి అలాట్ చేశారు. ముడా భూకేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన తర్వాత పార్వతి ఆ భూములను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, సీఎం సిద్ధరామయ్య తన కుటుంబ సభ్యులు ఎవరూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, ఇది కేవలం రాజకీయ కుట్ర అని కొట్టిపారేశారు. తనపై నమోదైన తొలి రాజకీయ కేసు అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed