ISKCON: చిన్మయి కృష్ణ దాస్ కేసు వాదించేందుకు ముందుకురాని లాయర్లు.. నెలపాటు జైళ్లోనే

by Shamantha N |
ISKCON: చిన్మయి కృష్ణ దాస్ కేసు వాదించేందుకు ముందుకురాని లాయర్లు.. నెలపాటు జైళ్లోనే
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్(Bangladesh) లో అరెస్టయిన ఇస్కాన్‌ (ISKCON)కు చెందిన చిన్మయి కృష్ణదాస్‌ (Chinmoy Krishnadas) కేసు వాదించేందుకు ఏ లాయరు కూడా ముందుకు రావట్లేదు. చిన్మయి కేసు వాదించేందుకు ముందుకు వచ్చిన లాయర్ రమణ్ రాయ్ పై దాడి జరిగింది. రవీంద్ర ఘోష్ అనే మరో న్యాయవాది కేసును వాదించేందుకు దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించి ఢాకా నుంచి వస్తే.. స్థానికులు అతడిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదని ఆరోపించారు. దీంతో చిన్మయి కృష్ణదాస్‌ తరఫున కేసును వాదించేందుకు లాయర్లు భయపడుతున్నారని తెలిపారు. కాగా.. మంగళవారం ఛటోగ్రామ్ కోర్టులో కృష్ణదాస్ బెయిల్ పై విచారణ జరిగింది. కానీ, ఆయన బెయిల్ విచారణను వాదించేందుకు ఎవరూ ముందుకురాలేదు. బెయిల్ విచారణను బంగ్లాదేశ్‌ కోర్టు వచ్చే జనవరి 2కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో, కృష్ణదాస్ దాదాపు నెలపాటు జైలులోనే ఉండనున్నారు.

లాయర్లపై బెదిరింపులు

చిట్టగాంగ్ బార్ అసోసియేషన్‌లో భాగమైన ముస్లిం న్యాయవాదులు గతంలో కృష్ణదాస్ తరపున హాజరైన వారిని బెదిరించారని.. ఆయన న్యాయబృందంలోని పలువురు తెలిపారు. బంగ్లాదేశ్‌లో(Bangladesh) ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయి కృష్ణదాస్‌ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్‌ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్‌) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్‌ వేయగా.. బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది.

Advertisement

Next Story

Most Viewed