Land-for-jobs case: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సమన్లు

by Shamantha N |   ( Updated:2025-02-25 15:01:35.0  )
Land-for-jobs case: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు సమన్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్, కుమార్తె హేమా యాదవ్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. వారితో సహా 77 మందికి కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 11న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న కేసులో ఈ పరిణామం జరిగింది. సీబీఐ సమర్పించిన తుది నివేదికతో పాటు మూడు చార్జిషీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిందితులందరు మార్చి 11న కోర్టు ఎదుట హాజరుకావాలని రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు జడ్జి విశాల్‌ గోగె ఆదేశాలు జారీ చేశారు. అన్ని చార్జిషీట్లపై ఉమ్మడి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. నిందితులందరికీ చార్జిషీట్‌ కాపీలను అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. అందులో భాగంగానే ఢిల్లీకోర్టు నోటీసులు ఇచ్చింది.

అసలు కేసేంటంటే?

ఇకపోతే, జూన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుండి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక ప్రయోజనాలకు బదులుగా వివిధ రైల్వే జోన్‌లలోని గ్రూప్ “డి” ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించింది. లాలూప్రసాద్ కుటుంబ సభ్యులకు ఈ ప్రయోజనాలన్నీ భూ బదలాయింపుల రూపంలో వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగాలు పొందిన వారు లేదా వారి కుటుంబాలు, పాట్నా నివాసితులు తమ భూమిని లాలూ కుటుంబం లేదా అతని బంధువుల నియంత్రణలో ఉన్న కంపెనీకి విక్రయించారని తెలిపింది. దీంతో, ఆస్తుల బదిలీ సులభతరం అయ్యిందని సీబీఐ వెల్లడించింది.

Advertisement
Next Story