జార్ఖండ్‌లో కీలక పరిణామం..సీఎం చంపయీ రాజీనామా

by vinod kumar |
జార్ఖండ్‌లో కీలక పరిణామం..సీఎం చంపయీ రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంపయీ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం గవర్నర్ సీపీ రాధాకృష్ణను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం చంపయీ విలేకరులతో మాట్లాడుతూ..‘నాయకత్వం మారినప్పుడు నాకు బాధ్యతలు అప్పగించారు. హేమంత్ తిరిగి వచ్చిన తర్వాత ఆయనను మా నాయకుడిగా ఎన్నుకున్నాం. అందుకే పదవికి రిజైన్ చేశా. కూటమిలోని ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు. భాగస్వామ్యపార్టీలన్నీ ఈ విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్పారు. అంతకుముందు రాంచీలోని సీఎం నివాసంలో జేఎంఎం శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో హేమంత్ సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో మరోసారి హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా.. గురువారం ఆయన ప్రమాణ స్వీకారం చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. దీంతో హేమంత్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఫిబ్రవరి 2వ తేదీన చంపయీ సోరెన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హేమంత్‌కు బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చారు. దీంతో చంపయీ రాజీనామా చేసి హేమంత్ కు మరోసారి సీఎం అయ్యేందుకు మార్గం సుగమం చేశారు. కాగా, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీ, సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్‌లకు ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు.

Next Story

Most Viewed