బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర నాయకులపై ఈసీకి ఫిర్యాదు చేసిన కర్ణాటక కాంగ్రెస్

by Harish |   ( Updated:2024-05-05 09:24:50.0  )
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర నాయకులపై ఈసీకి ఫిర్యాదు చేసిన కర్ణాటక కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ఆదివారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఫలనా అభ్యర్థికి ఓటు వేయవద్దని బెదిరిస్తున్న వీడియోను ఇటీవల బీజేపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆరోపిస్తూ జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, సోషల్ మీడియా ఇంచార్జి అమిత్ మాల్వియాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది.

లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టే లక్ష్యంతో ఈ వీడియోను బీజేపీ అధికారిక X హ్యాండిల్‌లో పోస్ట్ చేశారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారి కోసం రిజర్వ్ చేసిన నిధులను ముస్లింలు లాక్కుంటారని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని వారిని బెదిరించేందుకే వారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేపీసీసీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యల యానిమేషన్ పాత్రలు ఉన్నాయి. క్లిప్‌లో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీని గూడులో గుడ్లుగా చూపించారు. ముస్లిం కమ్యూనిటీ అని లేబుల్ చేసిన పెద్ద గుడ్డును రాహుల్ గాంధీకి సూచించారు.. ఇది SC, ST, OBC కమ్యూనిటీని తరిమికొట్టి, ముస్లిం కమ్యూనిటీగా వర్ణించే కోడిపిల్లకు నిధులు ఇస్తున్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నిధుల కేటాయింపులో కోత విధిస్తామని, వాటిని ముస్లిం వర్గాలకు మళ్లిస్తామని ఎక్కడా పేర్కొనలేదని కానీ బీజేపీ ఈ వీడియో ద్వారా కాంగ్రె‌స్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, బీజేపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed