Kamala Harris: వారం రోజుల్లో కమలా హ్యారిస్‌కు రూ. 1,675 కోట్ల విరాళాలు

by S Gopi |
Kamala Harris: వారం రోజుల్లో కమలా హ్యారిస్‌కు రూ. 1,675 కోట్ల విరాళాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఎన్నికల బరిలోకి అడుగుపెట్టగానే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గడిచిన వారం వ్యవధిలో 200 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 1,674.73 కోట్లు) నిధులు ఆమె ప్రచారం కోసం విరాళాలు అందాయి. ఇదివరకు ఎన్నడూ ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో విరాళాలు అందలేదని, ఇది కమలా హ్యారిస్‌కు లభిస్తున్న మద్దతుకు అద్దం పడుతోందని ఆమె క్యాంపెయిన్ టీమ్ తెలిపింది. ఇప్పటివరకు వచ్చిన విరాళాల్లో 66 శాతం మొదటిసారిగా విరాళం అందిస్తున్న వారి నుంచే వచ్చాయని హ్యారిస్ ఫర్ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైకెల్ టేలర్ పేర్కొన్నారు. మరోవైపు పార్టీలో అభ్యర్థిత్వం కోసం కమలా హ్యారిస్‌కు మద్దతు గణనీయంగా పెరిగింది. వారం వ్యవధిలో కొత్తగా 1,70,000 వాలంటీర్లు చేరారు. ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై గెలుపుకోసం అమెరికాలో 2 వేలకు పైగా కార్యక్రమాలను నిర్వహిస్తూ కమలా హ్యారిస్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని మైకెల్ టేలర్ చెప్పారు. డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్‌లకు ఓటమి తప్పదని, ఇదే సమయంలో హోరాహోరీలో పోరులో గెలిపు ఓటముల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండకపోవచ్చని టేలర్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుని కమలా హ్యారిష్‌ను అధ్యక్ష పోటీకి ఆమోదించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story