Jharkhand Elections: జార్ఖండ్‌లో ‘ఇండియా’ మేనిఫెస్టో రిలీజ్.. యువతపై వరాల జల్లు!

by vinod kumar |
Jharkhand Elections: జార్ఖండ్‌లో ‘ఇండియా’ మేనిఫెస్టో రిలీజ్.. యువతపై వరాల జల్లు!
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇండియా కూటమి తన మేనిఫెస్టోను మంగళవారం రిలీజ్ చేసింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) చీఫ్ హేమంత్ సోరెన్ (Hemanth soren), కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun karge), రాష్ట్రీయ జనతాదళ్(Rjd) నేత జేపీ యాదవ్‌(Jp Yadav)లు సంయుక్తంగా దీనిని విడుదల చేశారు. ఇందులో ఇండియా కూటమి ఏడు హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే యువతకు 10లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ. 15లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక ఎస్టీల రిజర్వేషన్ 28శాతం, ఎస్సీలకు 12శాతం, ఓబీసీలకు 27శాతం వరకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపింది.

రేషన్ ఏడు కేజీలకు పెంపు

ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం అందజేసే 5 కేజీల రేషన్‌‌కు బదులు ఏడు కేజీలు అందజేస్తామని పేర్కొంది. మహిళలకు ప్రతినెలా రూ 2500 అందజేయడంతో పాటు, గ్యాస్ సిలిండర్‌ రూ. 450కే ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చింది. రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు, జిల్లా కేంద్రాల్లో ఇంజనీరింగ్, వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక ప్రమోషన్ పాలసీని రూపొందిస్తామని తెలిపింది. అలాగే మైనార్టీ వర్గాల ప్రయోజనాలను పరిరక్షిస్తామని పేర్కొంది.

హామీలన్నీ నెరవేరుస్తాం: ఖర్గే

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. మేనిఫోస్టో రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ప్రణాళికల గురించి మాట్లాడినప్పుడల్లా ప్రధాని మోడీ కలుగజేసుకుని వెంటనే విమర్శలు చేస్తుంటారని, కానీ ఆయన ఇచ్చిన హామీలు మాత్రం ఎప్పటికీ నెరవేరబోవని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 13, 20 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed