జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భార్య ?

by Hajipasha |
జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ భార్య ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తున్న ప్రస్తుత తరుణంలో జార్ఖండ్‌లో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. బుధవారం ఉదయం జార్ఖండ్‌ సీఎం మీడియా సలహాదారు అభిషేక్‌ ప్రసాద్‌, సాహిబ్‌గంజ్‌ జిల్లా కలెక్టర్‌, మాజీ ఎమ్మెల్యే పప్పూ యాదవ్‌ సహా హేమంత్ సోరెన్ పలువురు సన్నిహితుల నివాసాలు, కార్యాలయాలపై ఈడీ రైడ్స్ చేసింది. ఈనేపథ్యంలో హుటాహుటిన రాష్ట్ర రాజధాని రాంచీలోని తన నివాసంలో అధికార కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు 43 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఇదే చివరి ఛాన్స్ అని అల్టిమేటం

అక్రమ మైనింగ్, భూకుంభకోణం కేసుల్లో సీఎంకు ఇటీవల ఏడోసారి సమన్లు పంపిన ఈడీ.. విచారణకు స్వయంగా వచ్చేందుకు ఇదే చివరి ఛాన్స్ అని అల్టిమేటం ఇచ్చింది. అయినా ఈసారి కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ తరుణంలో సీఎం సోరెన్ సన్నిహితులపై సోదాలతో దూకుడును పెంచిన ఈడీ.. తదుపరిగా సీఎం ఇంటికే రావచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో బుధవారం ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో తాను ఒకవేళ ఈడీ అదుపులోకి వెళితే.. తన భార్యకు పార్టీ, ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలనే అంశాన్ని సోరెన్ ప్రస్తావించారని అంటున్నారు. అయితే ఈ అంశాన్ని ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు.

Advertisement

Next Story