ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్

by Shamantha N |
ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును ప్రతిపాదించగానే ఆయనకు పూర్తి మద్దతు లభించింది. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపారు. కాగా.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌ జె.డి.వాన్స్‌ పేరును ట్రంప్‌ ప్రకటించారు. దీంతో నవంబరులో జరగే ఎన్నికలకు పార్టీ తరఫున పోటీ చేసే కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. సుదీర్ఘ చర్చలు, అందరి ప్రతిభను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాం అని ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ ద్వారా వెల్లడించారు.

ఎవరీ వాన్స్‌?

జేడీ వాన్స్ ఆగస్టు 2, 1984న ఒహియోలోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. ఆయన మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించారు. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ, యేల్‌ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. ఒహియో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లే ముందు ఇరాక్ యుద్ధంలో పనిచేశారు. యేల్‌ లా జర్నల్‌కు సంపాదకుడిగా ఉన్నారు. ఆయన రచించిన ‘హిల్‌బిల్లీ ఎలెజీ’ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు నెట్ ఫ్లిక్స్ లో సినిమాగా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. 39 ఏళ్ల వాన్స్‌ 2022లో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు. 2016లో ట్రంప్ విధానాలు విమర్శించారు. అప్పట్లో ట్రంప్ ను అమెరికా హిట్లర్ అని విమర్శలు గుప్పించారు. ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ వచ్చిన ఆయన.. చివరకు విధేయుడిగా మారారు. ఇకపోతే, ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ఒకరోజు తర్వాత- రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ఖరారుకావడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed