బీజేపీలోకి మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా

by Hajipasha |
బీజేపీలోకి మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని హస్తం పార్టీ ఏకైక ఎంపీ, మాజీ సీఎం మధు కోడా భార్య గీతా కోడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. సోమవారం రాంచీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సమక్షంలో గీతా కోడా కాషాయ పార్టీలో చేరారు.‘‘కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలతో దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. దేశంలోని అందరినీ తమ వెంట తీసుకెళ్తామని ఆ పార్టీ చెబుతుంది. కానీ అది గాంధీ కుటుంబాన్ని మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది’’ అని ఈసందర్భంగా గీత వ్యాఖ్యానించారు. 2017 సంవత్సరం నాటి బొగ్గు గనుల కేటాయింపులో రూ.4,000 కోట్ల అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో మధు కోడా దోషిగా తేలారు. తాజాగా ఆయన భార్య గీతా కోడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో.. త్వరలోనే ఆమె భర్త మధు కోడా కూడా కాషాయ కండువా కప్పుకుంటారనే అంచనాలు వెలువడుతున్నాయి. సింఘ్‌భూమ్ ఎంపీగా ఉన్న గీతా కోడాను పార్టీలో చేర్చుకోవడం వల్ల తూర్పు సింగ్‌భూమ్, పశ్చిమ సింగ్‌ భూమ్, సరైకేలా-ఖర్సావాన్ జిల్లాల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ బలంగా ఉండటం, మధు కోడా ప్రభావంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ తన ఖాతాను తెరవలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని 14 సీట్లకుగానూ 12 బీజేపీ గెల్చుకుంది.

Advertisement

Next Story