టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేది ఆ సంస్థే!

by D.Reddy |
టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేది ఆ సంస్థే!
X

దిశ, వెబ్ డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ చాలా ఫేమ‌స్‌ అయింది. మన దేశంలో కూడా టిక్ టాక్‌ను విపరీతంగా వాడేవారు. కానీ, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా జూన్ 2020లో మోడీ ప్రభుత్వం టిక్ టాక్‌ను బ్యాన్ చేసింది. ఇక ఇదే కారణంతో తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కూడా టిక్ టాక్ సేవ‌ల‌ను నిలిపివేసింది. సుమారు 17 కోట్ల మంది అమెరికన్లు టిక్ టాక్‌ను వినియోగించేవారు.

అయితే ఈ నెల 20న దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. టిక్‌టాక్ మనుగడ కోసం జాయింట్ వెంచర్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అమెరికాలో 50 శాతం ఓనర్‌షిప్ ఉండాలన్నారు. దీనికి వారు అంగీకరిస్తే ఉత్తమంగా నడిపించే వారి చేతుల్లోకి అది వెళుతుందన్నారు. అలాగే టిక్ టాక్‌ను అమెరికాలోనే కొనసాగించవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మరో 75 రోజుల పాటు యాక్టివ్‌గా ఉండేందుకు వీలుకల్పిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో టిక్ టాక్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ అగ్ర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. 'సావరిన్‌ వెల్త్‌ఫండ్‌'ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా సృష్టించిన సావరిన్‌ వెల్త్‌ఫండ్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని ట్రంప్‌ తెలిపారు.

Next Story