ISRO: విజయవంతంగా స్పేడెక్స్ డి-డాకింగ్‌ ప్రక్రియను పూర్తి చేసిన ఇస్రో

by S Gopi |
ISRO: విజయవంతంగా స్పేడెక్స్ డి-డాకింగ్‌ ప్రక్రియను పూర్తి చేసిన ఇస్రో
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతరిక్ష ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కీలక మైలురాయిని సాధించింది. అంతరిక్షంలో స్పేడెక్స్ డి-డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగ సమయంలో ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసేలా ఇస్రో ఈ మిషన్‌ను ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇస్రో తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'అనుకున్న విధంగానే క్యాప్చర్ లివర్ 3 విడుదలైంది. రెండు ఉపగ్రహాలకు డి-క్యాప్చర్ కమాండ్ ఇవ్వడం ద్వారా విజయవంతంగా డి-డాకింగ్ ప్రక్రియ పూర్తయిందని' పేర్కొంది. ఈ ఘనతను సాధించడంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో బృందాన్ని ప్రశంసించారు. 'ఇస్రో టీమ్‌కు అభినందనలు. స్పేడ్ఎక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా డీ-డాకింగ్ చేయడం ద్వారా గగన్‌యాన్, చంద్రయాన్4 లాంటి భవిష్యత్తు మిషన్‌లకు మార్గం సుగమం అయింది. ప్రతి భారతీయుడు సంతోషించే విషయం ఇదని' ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గతేడాది డిసెంబర్ 30న ఇస్రో తన ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. పలుమార్లు ప్రయత్నించిన తర్వాత ఈ ఏడాది జనవరి 16న డాకింగ్ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఈ అరుదైన మైలురాయిని సాధించిన యూఎస్, రష్యా, చైనాల తర్వాత నాలుగో దేశంగా భారత్ నిలిచింది. స్పేడ్ఎక్స్ మిషన్ చంద్రయాన్-4, భారత్ అంతరిక్ష స్టేషన్‌ను నిర్మించడం వంటి అనేక భవిష్యత్ ప్రాజెక్టులకు ఎంతో కీలకం. ఇందులో డాకింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed