మావోయిస్టులతో శాంతి చర్చలు.. అమిత్ షాకు శాంతి సంభాషణ కమిటీ కీలక లేఖ

by Shiva |   ( Updated:2025-04-13 07:02:35.0  )
మావోయిస్టులతో శాంతి చర్చలు.. అమిత్ షాకు శాంతి సంభాషణ కమిటీ కీలక లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌‌తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల పరిధిలోని మావోయిస్టులపై భద్రతా బలగాలు కాల్పుల మోత మోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 3న భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట ఓ లేఖను విడుదల చేసిన విషయం విదితమే. అయితే, దంతెవాడ - బీజాపూర్ సరిహద్దు వద్ద మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్ పక్కా బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. విప్లవకారులు, ఆదివాసీలు, మేధావులు ఏకమై ఈ నర సంహారాన్ని వెంటనే ఆపాలంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీపీఐ (మావోయిస్టు) పార్టీ, భద్రతా బలగాల మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు శాంతి సంభాషణ కమిటీ ఏర్పడింది. కమిటీకి చైర్మన్‌గా జస్టిస్ చంద్ర కుమార్ (మాజీ), ఉపాధ్యక్షుడిగా జంపన్న అలియాస్ నరసింహా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రో. హర‌గోపాల్, కన్వీనర్‌గా దుర్గా ప్రసాద్, కో-కన్వీనర్లుగా జయ వింధ్యాల, డాక్టర్ తిరుపతయ్య, బాలకిషన్‌రావు, కందుల ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

ఆ రెండు అంశాలే మా ఎజెండా

లేఖలో శాంతి సంభాషణ కమిటీకి తాము కన్వీనర్లమని పేర్కొన్నారు. శాంతి సభాషణ కమిటీ పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. CPI (మావోయిస్ట్) పార్టీ, భద్రతా బలగాలకు మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరపడమే ఉద్దేశంగా కమిటీ ఏర్పడిందని అన్నారు. కమిటీలో న్యాయ నిపుణులు, ప్రొఫెసర్లు, వైద్యులు, మానవ హక్కుల నిపుణులు, జర్నలిస్టులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజా నాయకులు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. సెంట్రల్ ఇండియాలో, మావోయిస్టు పార్టీ సాయుధ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ దళాలకు మధ్య జరుగుతున్న హింస కారణంగా సాధారణ పౌరులు, గిరిజన వర్గాలు తమ జీవించే హక్కును కోల్పోతున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇటీవల తాజా పరిణామాలు చూసి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఐదు రాష్ట్రాల పరిధిలో ప్రజలు నిరంతరం రక్తపాతం మధ్య జీవిస్తున్నారనే వార్తలతో కలవరపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వైపులా హింసాత్మక చర్యలతో మహిళలు, పిల్లలు, యువత భయంతో జీవిస్తున్నారని చాలా మంది నిర్వాసితులు అవుతున్నారని నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయని అన్నారు.

శాంతి చర్చలే ఏకైక మార్గం..

శాంతిని కోరుకునే ప్రజాస్వామ్యవాదులుగా, మావోయిస్టు పార్టీ గెరిల్లాలకు, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతోన్న సంఘర్షణను నివారించడానికి కాల్పుల విరమణ, శాంతి చర్చలు మాత్రమే ఏకైక మార్గమని తాము నమ్ముతున్నామని అన్నారు. రెండు వైపుల మధ్య జరిగే ఈ సాయుధ పోరాటం దేశంలోని అనేక ప్రాంతాల్లో అశాంతి, ప్రాణ నష్టానికి కారణమవుతోందని కామెంట్ చేశారు. ఇక మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని, చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోతున్నారని అన్నారు. గిరిజన వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ ప్రత్యక్ష యుద్ధంతో మానవ హక్కులు పెద్ద ఎత్తున ఉల్లంఘించబడుతున్నాయని, హింసాత్మక చర్యలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయని, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని అన్నారు.

భారత రాజ్యాంగం ఊహించిన సంక్షేమ రాజ్య స్థాపన కోసం, దేశంలో పెరుగుతున్న హింస, దాని పర్యవసానాలు, పరిస్థితులను పరిష్కరించడానికి మీ తక్షణ జోక్యం అవసరమని మేము అభ్యర్థిస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు. శాంతి సంభాషణల కమిటీ దేశం యొక్క భవిష్యత్తుకు మీ తక్షణ జోక్యం అవసరమని మీరు పరిగణించాలని, ఇరు పక్షాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండేందుకు, శాంతి చర్చల మార్గంలోకి రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నట్లుగా తెలిపారు.

Next Story

Most Viewed