భారత్‌లో ఇస్లాంకు ‘ప్రత్యేక’ స్థానం : Ajit Doval

by Vinod kumar |
భారత్‌లో ఇస్లాంకు ‘ప్రత్యేక’ స్థానం : Ajit Doval
X

న్యూఢిల్లీ: భారత దేశం శతాబ్దాలుగా సామరస్యంతో సహజీవనం చేస్తున్న మతాల, సంస్కృతులు, భాషల, జాతుల సమ్మేళనం అని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. దేశంలోని మత సమూహాల్లో ఇస్లాం ఒక ‘ప్రత్యేక’ స్థానం ఆక్రమించిందన్నారు. భారత్ పర్యటనలో ఉన్న ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా మంగళవారం ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ.. భారత్, సౌదీ అరేబియాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, సాంస్కృతిక వారసత్వం, ఉమ్మడి విలువలు, ఆర్థిక సంబంధాల్లో రెండు దేశాలు సాన్నిహిత్యంతో మెలుగుతున్నాయన్నారు.

భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యాలకు తల్లి వంటిదని దోవల్ విశ్లేషించారు. ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం భారత్ ప్రత్యేకత అని, ఇది గర్వించదగిన విషయమని దోవల్ పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (వోఐసీ)లోని 33 సభ్య దేశాల ఉమ్మడి జనాభాతో భారత దేశ ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉందని దోవల్ విశ్లేషించారు.

సహజీవనానికి భారత్ గొప్ప నమూనా అని మహ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా ప్రశంసించారు. దేశంలో హిందువులు, ముస్లింలు శతాబ్దాలుగా కలిసి జీవించడం సంతోషించదగిన విషయమన్నారు. భారతీయుల, ఆ దేశ రాజ్యాంగం పట్ల తాము గర్వపడుతున్నామన్నారు. ఆరు రోజుల పర్యటన కోసం అల్ ఇస్సా సోమవారం భారత్ వచ్చారు. సౌదీ అరేబియా స్థాపించిన ముస్లిం వరల్డ్ లీగ్ నిధులు సమకూర్చే అంతర్జాతీయ ఇస్లామిక్ ఎన్జీవో. అల్ ఇస్సా పర్యటనను ‘శాంతి దౌత్యం’గా భారత్ అభివర్ణించింది.

Advertisement

Next Story

Most Viewed