Punjab: మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర

by Shamantha N |
Punjab: మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని బఠిండాలో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. గూడ్స్ రైలు వెళ్లాల్సిన రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు కనిపించాయి. లోక్ పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు (GRP) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైలు ప్రమాదానికి కుట్రపన్నారా.. లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. "తెల్లవారుజామున 3 గంటలకు, బటిండా-ఢిల్లీ రైల్వే ట్రాక్ గుండా గూడ్స్ వెళ్తోంది. అయితే, రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ అందలేదు. దీంతో, ట్రైన్ చాలా ఆలస్యమైంది" అని ఇన్వెస్టిగేటింగ్ అధికారి శవీందర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 9 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు.

ఈనెలలోనే నాలుగో ఘటన..

ఇకపోతే, సెప్టెంబరు నెలలోనే రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించిన నాలుగో ఘటన ఇది. సెప్టెంబర్ 22న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై సిలిండర్ ని అధికారులు గుర్తించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సకాలంలో బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు, సెప్టెంబరు 10 న రైల్వేశాఖ సంచలన వివరాలు వెల్లడించింది. ఆగస్టు నుండి దేశవ్యాప్తంగా 18 రైళ్లను పట్టాలు తప్పించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొంది. జూన్ 2023 నుండి ఇప్పటి వరకు, రైల్వే ట్రాక్‌లపై సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్‌లు, సిమెంట్ దిమ్మలు వంటి వస్తువులు కనిపించిన 24 ఘటనలు జరిగాయి.

Next Story

Most Viewed