18 ఏళ్ల తర్వాత అన్నా చెల్లెలిని కలిపిన ఇన్ స్టాగ్రామ్ రీల్

by prasad |
18 ఏళ్ల తర్వాత అన్నా చెల్లెలిని కలిపిన ఇన్ స్టాగ్రామ్ రీల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా విస్తృతంగా వాడుకలోకి వచ్చాక నేరాలు సంఖ్య పెరిగిపోతున్నాయి. అయితే అదే సమయంలో సక్రమంగా వినియోగించుకుంటే మాత్రం సోషల్ మీడియా ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి అని నిరూపించేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా 18 ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని తన తోబుట్టువును ఓ సోదరి ఇన్ స్టాగ్రామ్ రీల్ ద్వారా గుర్తించగలిగింది. ఈ ఆశ్చర్యపరిచే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. కాన్పూర్ కు చెందిన రాజ్ కుమార్ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తోంది. ఈ క్రమంలో విరిగిన పంటితో ఉన్న ఓ వ్యక్తి రీల్ లో కనిపించాడు. దీంతో ఆమె అతడిని ఎక్కడో చూసినట్లుగా ఉందని ఆ అకౌంట్ లో ఉన్న మరికొన్ని రీల్స్ ను పరిశీలించింది. అయితే అందులో ఉన్నది మరెవరో కాదు తమ కుటుంబానికి దాదాపు రెండు దశాబ్దాలుగా దూరంగా ఉంటున్న తన సోదరుడు గోవింద్ గా గుర్తుపట్టింది. వెంటనే ఆ అకౌంట్ ద్వారా గోవింద్ తో చాటింగ్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసింది. ఫోన్ నెంబర్ తీసుకుని ఇంటికి రావాలని కోరింది. చెల్లి మాటలకు కరిగిపోయిన గోవింద్ ఈనెల 20వ తేదీన తన స్వగ్రామానికి బయలుదేరి వచ్చేశాడు. దీంతో ఇన్నాళ్లుత బతికే ఉన్నా తమకు దూరంగా ఉన్న గోవింద్ ను చూసి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

కాగా పని కోసం తన స్వగ్రామాన్ని వదిలి గోవింద్ 18 ఏళ్ల క్రితం ముంబైకి వెళ్లాడు. అప్పటి నుంచి స్వగ్రామానికి వెళ్లలేదు. మొదట్లో తన స్నేహితులతో అప్పుడప్పుడు మాట్లాడినప్పటికీ క్రమంగా వారితోనూ రిలేషన్ కట్ చేసుకున్నాడు. అయితే ఓ రోజు అనారోగ్యంతో బాధపడుతున్న గోవింద్ ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో రైలు ఎక్కాడు. కానీ అతడు కాన్పూర్ కు బదులు రాజస్థాన్ ట్రైన్ ఎక్కాడు. జైపూర్ లో దిగిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న గోవింద్ కు ఓ వ్యక్తి చేరదీశాడు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అతనికి ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇచ్చాడు. క్రమంగా గోవింద్ పరిస్థితి మెరుగుపడింది. దాంతో అతడు వివాహం చేసుకుని జైపూర్ లోనే సెటిల్ అయ్యాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో జైపూర్‌లోని వివిధ ప్రదేశాలను చూపిస్తూ గోవింద్ తీసిన ఓ రీల్ ను అతడి సోదరి రాజ్ కుమారి ఇన్ స్టా గ్రామ్ లో చూసింది. అయితే పద్దెనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన అన్న ముఖాన్ని మర్చిపోయినప్పటికీ విరిగిపోయిన పంటిని గమనించడంతో ఆయన తన అన్నే అని గుర్తించగలిగింది. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం స్వగ్రామాన్ని విడిచి వెళ్లిన గోవింద్ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని తిరిగి వెనక్కి వచ్చేయడంతో వారి కుటుంబం హ్యాపీగా ఫీల్ అవుతోంది.

Next Story

Most Viewed