ఇండియా కూటమిదే విజయం: కాంగ్రెస్ నేత చిదంబరం దీమా

by samatah |
ఇండియా కూటమిదే విజయం: కాంగ్రెస్ నేత చిదంబరం దీమా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం దీమా వ్యక్తం చేశారు. 2019 కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు. తమిళనాడు, కేరళలో మాత్రం అత్యధిక మెజారిటీ రావడం ఖయమని తెలిపారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. ప్రధాని మోడీని రక్షకుడిగా చూపేందుకు మొత్తం ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా బీజేపీ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటే మరింత బలం చేకూరేదని వెల్లడించారు. కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అత్యంత ప్రజాదరణ పొందాయని కొనియాడారు. కాంగ్రెస్ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలిపారు.

అలాగే హర్యానా, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్. ఢిల్లీ నుండి ఇండియా కూటమికి మంచి ఫలితాలు వస్తాయని అంచనావేశారు. ‘ప్రతిపక్షాలను బీజేపీ హిందూ వ్యతిరేకులుగా చిత్రికరిస్తోంది. హిందూ రక్షుడిగా మోడీని హైలైట్ చేయడానికే వారు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. అంతేతప్ప దేశంలో హిందూయిజం ప్రమాదంలో లేదు’ అని వ్యాఖ్యానించారు. కచ్చతీవు సమస్య మూతపడిపోయిందని, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తడం ఏమిటని చిదంబరం ప్రశ్నించారు. 50ఏళ్ల క్రితం ఈ ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. పదేళ్లుగా అధికారంలోనే ఉన్న మోడీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదో సమాధానం చెప్పాలన్నారు.

Advertisement

Next Story