Indian SMEs: చైనా కంపెనీలతో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త: భారత ఎంబసీ హెచ్చరిక

by S Gopi |
Indian SMEs: చైనా కంపెనీలతో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త: భారత ఎంబసీ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనాలోని ఆ దేశ కంపెనీలతో ఏదైనా వ్యాపారం చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని బీజీంగ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం అధికారులు మనదేశ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను(ఎస్ఎంఈ) కోరింది. చైనాలోని వారి కంపెనీలతో వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎంబసీ గమనిస్తోందని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించింది. ఏవైనా చైనా కంపెనీలతో వ్యాపారం చేయడానికి ముందు, భారతీయ కంపెనీలు భారత ఎంబసీకి లేదా షాంఘై, గ్వాంగ్‌జౌ, హాంకాంగ్‌లలోని భారత కాన్సులేట్‌లకు సంస్థ గురించి తెలియజేయాలని సిఫార్సు చేసింది. దానిపై 4-5 పనిదినాల్లో స్పందన వస్తుందని తెలిపింది. ముఖ్యంగా అధిక లావాదేవీలకు సంబంధించిన వ్యాపారాల విషయంలో మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. అటువంటి చైనా సంస్థల వ్యాపార పారదర్శకత, ఆర్థిక పనితీరు, విశ్వసనీయత వంటి అంశాలను పరిశీలించే బిజినెస్ సర్వీస్ కంపెనీని సంప్రదించాలని హెచ్చరించింది. వ్యాపారం చేసే ముందు భారత కంపెనీ చైనా సంస్థలకు చెందిన రెసిడెంట్ ఐడెంటిటీ కార్డు(చైనీస్ ఐడెంటిటీ నంబర్), సదరు కంపెనీ యజమాని పాస్‌పోర్ట్, ఇతర వివరాల కాపీలను సేకరించి ఉంచుకోవాలని ఎంబసీ సలహా ఇచ్చింది. ప్రధానంగా షాన్‌డాంగ్, హెబీ, గ్వాంగ్‌డాంగ్, జియాంగ్సు, జెజియాంగ్ ప్రావిన్స్‌లలో ఉండే సంస్థల కారణంగా వివాదాల కేసులు నమోదవుతున్నాయని భారత రాయబార కార్యాలయం గుర్తించింది. అందువల్ల భారత కంపెనీలు ఈ ప్రావిన్సులకు చెందిన కంపెనీల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కాగా, చైనాలో వ్యాపారాలకు సంబంధించి గతంలో మేధో సంపత్తి(ఐపీ) సమస్యలు, చట్టపరమైన వివాదాలు, సైబర్ సెక్యూరిటీ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి.

Advertisement

Next Story