INDIA vs PAK: భారత జాలర్లను బంధించిన పాక్.. వెంటాడి, వేటాడి కాపాడిన ఇండియా

by karthikeya |   ( Updated:2024-11-19 06:44:15.0  )
INDIA vs PAK: భారత జాలర్లను బంధించిన పాక్.. వెంటాడి, వేటాడి కాపాడిన ఇండియా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జాలర్లను బంధించి తీసుకెళ్తున్న పాకిస్తాన్ నౌకను ఇండియన్ కోస్ట్‌గార్డ్ (Indian Coast Guard) వేటాడి వెంటాడి మన మత్స్యకారులను రక్షించింది. మంగళవారం నాడు అరేబియా సముద్రంలోని నో ఫిషింగ్ జోన్‌ సమీపంలో ‘కాల భైరవ్’ అనే భారత మత్స్యకారుల బోటును పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన నౌక అడ్డుకుంది. వారంతా నో ఫిషింగ్ జోన్‌లో ఉన్నారంటూ వెంటనే బోటులోని ఏడుగురినీ అదుపులోనికి తీసుకుని పాకిస్తాన్ తరలించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని మత్స్యకారులు ఇండియన్ కోస్ట్ గార్డ్స్‌కు తెలియజేయడంతో హుటాహుటిన బయలుదేరిన కోస్ట్ గార్డ్ నౌక పాకిస్తాన్ నౌకను వెంటాడి, వేటాడింది. ఆనౌక పాకిస్తాన్‌ జలాల్లో ప్రవేశించకముందే అడ్డుకుని భారత మత్స్యకారులను కాపాడింది.

ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్‌గార్డ్ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. రక్షించిన జాలర్లతోపాటు పాకిస్తాన్ మారిటైమ్ నౌకను వెంబడిస్తున్న దృశ్యాలను షేర్ చేసిన ఐసీజీ.. ‘భారత మత్స్యకారులను బంధించి తీసుకెళ్తున్న పాకిస్తాన్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక నుంచి ఏడుగురు మత్స్యకారులను రక్షించాం. పీఎంఎస్‌ఏ నౌక పాక్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఐసీజీ నౌక వెంబడించి అడ్డుకుంది. చివరకు పాక్‌ అధికారుల చెరనుంచి భారత మత్స్యకారులను సుక్షితంగా విడిపించడం జరిగింది.’ అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే.. జాలర్లకు చెందిన కాల భైరవ్‌ నౌక దెబ్బతిందని, అనంతరం అది మునిగిపోయిందని అధికారులు వెల్లడించారు. జాలర్లను ఓఖా నౌకాశ్రయానికి చేర్చామని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed