ఖర్గే, రాహుల్‌తో పవార్ భేటీ.. ‘ఇండియా’ వ్యూహాలపై చర్చ

by Vinod kumar |
ఖర్గే, రాహుల్‌తో పవార్ భేటీ.. ‘ఇండియా’ వ్యూహాలపై చర్చ
X

న్యూఢిల్లీ : వచ్చే లోక్ సభ ఎన్నికలు లక్ష్యంగా విపక్ష కూటమి ‘ఇండియా’ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీతో ఎన్సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ శుక్రవారం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు అవసరమైన వ్యూహాలపై ఈసందర్భంగా చర్చించినట్టు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఇండియా కూటమి తదుపరి సమావేశానికి అవసరమైన ప్రణాళికను రూపొందించినట్టు సమాచారం. పవార్‌తో భేటీకి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దేశ ప్రజల గొంతుకను మరింత బలంగా వినిపించే లక్ష్యంతోనే రాహుల్ తో పవార్ సమావేశమయ్యారని చెప్పారు.

ఏ ఛాలెంజ్‌‌ను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధమేనన్న ఖర్గే.. ‘జుడేగా భారత్‌.. జీతేగా ఇండియా’ అని ట్వీట్‌ చేశారు. శరద్‌ పవార్‌ సైతం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్‌ చేశారు. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవద్‌, కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీ సభ్యుడు గుర్‌దీప్‌ సపాల్‌ ఉన్నారని వెల్లడించారు. కాగా, ఇండియా కూటమి తదుపరి సమావేశాన్ని పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story