Singapore : భారత్‌లో మరిన్ని సింగపూర్‌లను సృష్టిస్తాం : ప్రధాని మోడీ

by Hajipasha |
Singapore : భారత్‌లో మరిన్ని సింగపూర్‌లను సృష్టిస్తాం : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌ కూడా అనేక సింగ్‌పూర్‌లను సృష్టించాలని అనుకుంటోందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్‌ ఒక నమూనా అని.. దాన్ని అనుసరించాలని అందరూ భావిస్తారని చెప్పారు. సింగపూర్ కేవలం భాగస్వామ్య దేశం కాదని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అదొక స్ఫూర్తి అని ఆయన అభివర్ణించారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్‌ వాంగ్‌తో భారత ప్రధాని సమావేశమయ్యారు. ఈ భేటీలో నైపుణ్య శిక్షణ, డిజిటలైజేషన్‌, మొబిలిటీ, తయారీ, సెమీకండక్టర్లు, ఏఐ, ఆరోగ్య సంరక్షణ, సైబర్‌ సెక్యూరిటీ తదితర రంగాల్లో సహకరించుకోవడంపై చర్చించినట్లు మోడీ వెల్లడించారు.

‘‘భారత్‌లో అనేక సింగపూర్‌లను సృష్టించేందుకు మనం సహకరించుకోవడం సంతోషంగా ఉంది. మంత్రుల స్థాయిలో నిర్వహించిన చర్చలు ఇందుకు ఓ మార్గనిర్దేశం అవుతాయి’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని లారెన్స్‌ యువ నాయకత్వంలో సింగపూర్‌ మరింత పురోగతి సాధిస్తుందని మోడీ ఆకాంక్షించారు. ‘‘భారత్‌కు చెందిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో అత్యంత కీలకమైన దేశం సింగపూర్. ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు మా రెండు దేశాలను ఏకం చేస్తుంటాయి. గత పదేళ్లలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం రెట్టింపైంది. పెట్టుబడులు 150 బిలియన్ డాలర్లను దాటాయి. భారత్‌కు చెందిన యూపీఐ పేమెంట్ పద్ధతిని పూర్తిగా వినియోగంలోకి తెచ్చిన తొలిదేశం సింగపూరే’’ అని భారత ప్రధాని వివరించారు.

Advertisement

Next Story