సైబర్ నేరాల దర్యాప్తుకు చేతులు కలిపిన ఇండియా, అమెరికా

by John Kora |
సైబర్ నేరాల దర్యాప్తుకు చేతులు కలిపిన ఇండియా, అమెరికా
X

- ఎంవోయూపై సంతకాలు చేసిన ఇరు దేశాలు

- సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ మరింత సులభతరం

- టెర్రరిజంతో పాటు ఇతర నేరాలపై కూడా ఫోకస్

దిశ, నేషనల్ బ్యూరో:

అంతర్జాతీయ సైబర్ నేరాల దర్యాప్తులో కీలక అడుగు పడింది. ప్రస్తుత కాలంలో అత్యంత సంక్లిష్టంగా మారిన సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్‌ను మరింత సులభతరం చేయడానికి ఇండియా, అమెరికా చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు దేశాల్లోని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు సహకరించుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూపై అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా, యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ తాత్కాలికి డిప్యూటీ సెక్రటరీ క్రిస్టీ కనెగలో సంతకాలు చేశారు. సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ అవగాహనా ఒప్పందం ఉపయోగపడనుంది. సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌లో డిజటల్ ఫోరెన్సిక్‌ను గతంలో కంటే మరింత ఎక్కువగా వాడుకోవడానికి, శిక్షణ ఇవ్వడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీసీసీసీ), అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీతో పాటు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్, హెంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ సైబర్ క్రైం సెంటర్‌లు పరస్పరం సహకరించుకోనున్నాయి. ఇండియా, అమెరికాలు గత కొన్నేళ్లుగా భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, టెర్రర్ ఫైనాన్సింగ్, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, మనీ లాండరింగ్ వంటి నేరాలతో సతమతం అవుతున్నాయి. ఈ ఎంవోయూతో సైబర్ నేరాల దర్యాప్తుతో పాటు వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

'సంచార్ సాథీ' మొబైల్ యాప్ విడుదల చేసిన టెలికాం విభాగం

గత కొంతకాలంగా పెరుగుతున్న మోసాపూరిత కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు టెలికాం విభాగం 'సంచార్ సాథి' మొబైల్ యాప్‌ను రూపొందించింది. టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీన్ని ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కాల్ లాగ్‌ నుంచి నేరుగా సదరు నంబర్‌ను బ్లాక్ చేయడం లేదా దానిపై ఫిర్యాదు చేసే సదుపాయాలను కల్పిస్తుంది. 2023లోనే సంచార్ సాథి వెబ్‌సైట్ తీసుకొచ్చినప్పటికీ, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మొబైల్ యాప్‌ను కూడా టెలికాం విభాగం అందుబాటులోకి తెచ్చింది. దీనిద్వారా వెగంగా పెరుగుతున్న సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లోనూ ఉందని టెలికాం విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ యాప్ నుంచి స్పామ్ కాల్స్‌ను గుర్తించి ఫిర్యాదు చేయడంతో పాటు నెట్‌వర్క్ సబ్‌స్క్రైబర్ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి, అనధికారికంగా ఎవరైనా కస్టమర్ పేరు మీద నంబర్ వాడుతుంటే దానిపై ఫిర్యాదు చేసే వీలుంటుంది. అలాగే, మొబైల్‌ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనం జరిగితే సిమ్ కార్డును బ్లాక్ చేయవచ్చు.

Next Story

Most Viewed