పాలస్తీనా వాదాన్ని దేశం మరవొద్దు : Shashi Tharoor

by Vinod kumar |
పాలస్తీనా వాదాన్ని దేశం మరవొద్దు : Shashi Tharoor
X

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి పట్ల కాంగ్రెస్ చేసిన ప్రకటన విమర్శలకు దారితీసింది. అయితే ఆ ఉగ్రవాద సంస్థ పాలస్తీనాకు ప్రాతినిథ్యం వహించడం లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ అన్నారు. బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన థరూర్.. పాలస్తీనా వాదాన్ని దేశం మరచిపోకూడదన్నారు. ‘ప్రధానమంత్రి ట్వీట్లను బట్టి భారత్ ఇప్పటివరకు హమాస్‌‌ నుంచి అమానవీయ దాడులకు గురైన ఇజ్రాయెల్‌ పక్షాన నిస్సందేహంగా స్టాండ్ తీసుకుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ సాంప్రదాయ భారతీయ స్థానం నుంచి తప్పిపోయినట్లుగా కనిపించే విస్తృత చిత్రం ఉన్నందున ఇది మరింత దూరం వెళ్లవద్దు’ అని సూచించారు.

జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరకు పాలస్తీనా పోరాటానికి భారత్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అంతకుముందు ఈ యుద్ధంపై నిరాశ, వేదనను వ్యక్తం చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. పాలస్తీనా ప్రజల భూమి, స్వయం-పరిపాలన, గౌరవంగా జీవించే హక్కును కూడా నొక్కి చెప్పింది. ఈ ప్రకటనను విమర్శించిన బీజేపీ.. కాంగ్రెస్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే శాంతియుతంగా జీవించడానికి ఇజ్రాయెలీలకు ఉన్నంత హక్కు పాలస్తీనియన్లకు కూడా ఉందని థరూర్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story