దేశీయంగా ఐదేళ్లలో 65 పరీక్షల పేపర్ లీకేజీ ఘటనలు

by S Gopi |
దేశీయంగా ఐదేళ్లలో 65 పరీక్షల పేపర్ లీకేజీ ఘటనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం అత్యంత చర్చనీయాంసం, వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే యొక్క ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్(ఓఎస్ఐఎన్‌టీ) బృందం ఆసక్తికర డేటాను విడుదల చేసింది. కేవలం నీట్ మాత్రమే కాకుండా 2019 నుంచి దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో 64 ఇతర ప్రధాన పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని వెల్లడించింది. పబ్లిక్ రికార్డులు, మీడియా నివేదికల ఆధారంగా సేకరించిన డేటా ప్రకారం.. ఎఫ్ఐఆర్, నిందితుల అరెస్టులు, పరీక్షాల రద్దు వంటి వాటి ఆధారంగా సమాచారం సేకరించారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం కాకుండా మరో నాలుగు ప్రధాన దేశవ్యాప్త పరీక్షల పేపర్ లీక్‌లు నమోదయ్యాయి. అవి, ఇండియన్ ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2021, సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, నీట్-యూజీ 2021, జేఈఈ మెయిన్స్ 2021 ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించి యూపీ నుంచే అత్యధికంగా ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

2019, జనవరి నుంచి 2024, జూన్ 25 మధ్య రాజస్థాన్, మహారాష్ట్రలలో ఏడు పేపర్ లీకేజీ వ్యవహారాలు బయటపడ్డాయి. బీహార్‌లో ఆరు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో నాలుగు చొప్పున, హర్యానా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మూడు చొప్పున, ఢిల్లీ, మణిపూర్, తెలంగాణలలో ఒక్కోటి చొప్పున పేపర్ లీకేజీ కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, నాగాలాండ్‌లలో కూడా పేపర్ లీకేజీ జరిగాయి. మొత్తం 45 పరీక్షలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామక పరీక్షలు జరగ్గా, వాటిలో కనిసం 27 రద్దు చేయడం లేదా వాయిదా పడ్డాయి. నాన్-రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో కనీసం 17 రాష్ట్ర బోర్డులు, విశ్వవిద్యాలయాలకు చెందినవి ఉన్నాయి. పేపర్ లీక్‌ల కారణంగా మూడు లక్షలకు పైగా ప్రభుత్వ పోస్టుల భర్తీకి పరీక్షలు రద్దు అయ్యాయని నివేదిక పేర్కొంది. రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష, అస్సాం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌లలో పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్షలు, ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రిక్రూట్‌మెంట్ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌లలో జూనియర్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలతో సహా అనేక రకాల పరీక్షలపై ప్రభావం పడింది.

Advertisement

Next Story

Most Viewed