చైనా-పాకిస్తాన్‌ సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ అభ్యంతరం

by S Gopi |
చైనా-పాకిస్తాన్‌ సంయుక్త ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ అభ్యంతరం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల చైనా, పాకిస్తాన్ దేశాల ఉమ్మడి ప్రకటనలో జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకురావడంపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన 'అనవసర ' సూచనలను తిరస్కరిస్తూ, తమ కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. 'జూన్ 7న చైనా, పాకిస్తాన్‌ల సంయుక్త ప్రకటనలో జమ్మూకశ్మీర్ ప్రాంతంపై అనవసరమైన ప్రస్తావనలు వచ్చినట్టు గుర్తించాం. ఆయా దేశాల సూచనలను నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నట్టు' విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ ప్రాంతానికి సంబంధించి మా వైఖరి స్పష్టంగా ఉంది. ఇది సంబంధిత దేశాలకు కూడా తెలుసు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయి. అలాగే ఉంటాయి కూడా' అని ఆయన పేర్కొన్నారు. దీనిపై వ్యాఖ్యలు చేసే అధికారం మరే దేశానికి లేదని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. జూన్ 7న బీజింగ్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా ప్రధాని లీ కియాంగ్ మధ్య జరిగిన చర్చల అనంతరం ఓ సంయుక్త ప్రకటన వెలువడింది. రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని కశ్మీర్‌ సహా అన్ని వివాదాస్పద అంశాల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదు' అని ప్రకటనలో చెప్పాయి.

Advertisement

Next Story

Most Viewed