‘ఇండియా’ కూటమికి 272 సీట్లు ఖాయం : కాంగ్రెస్

by Hajipasha |   ( Updated:2024-03-24 11:47:17.0  )
‘ఇండియా’ కూటమికి 272 సీట్లు ఖాయం : కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఐక్యంగా 272 లోక్‌సభ సీట్లను సాధిస్తాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ పేర్కొన్నారు. అధికార పీఠం నుంచి బీజేపీ గద్దె దిగడానికి ఇక కొన్ని రోజుల సమయమే మిగిలిందని ఆయన తెలిపారు. మమతా బెనర్జీ వంటి వాళ్లు సీట్ల సర్దుబాటుకు నో చెప్పినా.. ఇండియా కూటమిలోని ఇతర రాజకీయ పక్షాల ఐక్యత, విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. సీట్ల సర్దుబాటుకు అంగీకరిం చకున్నా.. భవిష్యత్తులో మమత ఇండియా కూటమి వైపే నిలుస్తారని జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ లాంటి వాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన ఇండియా కూటమికి జరిగే నష్టమేం ఉండదన్నారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ స్థానాలకుగానూ 272 సీట్లను ఇండియా కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని జైరాం రమేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ, శివసేన, డీఎంకే, జేఎంఎంలతో పొత్తు మాదిరిగానే ఆమ్ ఆద్మీ పార్టీతోనూ కాంగ్రెస్ పొత్తు చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం, సీపీఐలతో తమకు పొత్తు ఖరారు కానుందని వెల్లడించారు. అసోంలో 11 పార్టీలతో.. యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో తమకు పొత్తు ఉందన్నారు.

Advertisement

Next Story