జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి: జేపీ నడ్డా

by S Gopi |
జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి: జేపీ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కుటుంబ నియంత్రణ హక్కు మహిళలు వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. ముఖ్యంగా వేగంగా జనాభా పెరుగుతున్న రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టడం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాంటి రాష్ట్రాల్లో గర్భనిరోధక సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. 'దేశ జనాభా ప్రపంచంలో ఐదో వంతుకు ఉంది. కాబట్టి జనాభా నియంత్రణపై మనం బాధ్యత కలిగి ఉండాలి. జనాభాలో 65 శాతం మంది యువత ఉన్నారు. వారిని దేశ అభివృద్ధికి కీలకంగా మార్చవచ్చు. ఇదే సమయంలో వారిలో చైతన్యం కలిగిన జనాభాను నియంత్రించడానికి కూడా వీలుంది. తక్కువ మంది పిల్లలు ఉంటే వారికి మెరుగైన జీవితం ఇవ్వొచ్చనే విషయాన్ని తెలియజేయాలని మంత్రి వివరించారు. దేశ యువతలో అవగాహన్ పెరిగితే భవిష్యత్తులో జనాభా పెరగకుండా నియంత్రించగలమని జేపీ నడ్డా తెలిపారు. ఐక్యరాజ్యసమితి 2011 నాటికి లెక్కల ప్రకారం, ప్రపంచ జనాభా 700 కోట్ల మార్కును చేరుకుంది. 2021లో ఇది 790 కోట్లకు చేరగా, 2030లో 850 కోట్లకు, 2050 నాటికి 970 కోట్లకు, 2100లో 1090 కోట్లు పెరుగుతుందని అంచనా.

Advertisement

Next Story

Most Viewed