Iltija Mufti: ఎన్నికల తర్వాత పీపీడీనే కింగ్ మేకర్.. ఇల్తిజా ముఫ్తీ

by vinod kumar |
Iltija Mufti: ఎన్నికల తర్వాత పీపీడీనే కింగ్ మేకర్.. ఇల్తిజా ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ప్రస్తుతం ప్రభావవంతంగా కనిపించనప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అన్నారు. శనివారం ఆమె శ్రీనగర్ లో ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. కశ్మీర్ అత్యంత కష్ట సమయంలో తాను ఎన్నికల రంగంలోకి దిగినట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత పీడీపీ కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తుందని, బీజేపీయేతర సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో ముందుంటుందని నొక్కి చెప్పారు. నిషేధిత జమాత్-ఎ-ఇస్లామీ మాజీ సభ్యులతో సహా పలువురు స్వతంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై అడిగిన ప్రశ్నకు ముఫ్తి స్పందిస్తూ.. జమాత్ చాలా మంచి సంస్థ అని కొనియాడారు. వారు అద్భుతంగా పని చేశారని, పిల్లలందరికీ ఉచిత విద్యను అందిస్తారని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ పోరాడే స్వేచ్ఛ ఉందని తెలిపారు. ముఫ్తీని ఎన్నుకోవాలా, జమాతేను గెలిపించాలా అనే విషయం ఓటర్లు నిర్ణయిస్తారని చెప్పారు. ప్రధాన పార్టీలన్నీ ఒకరొకొకరు అపహాస్యం చేసుకోవడం సరికాదన్నారు. బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ తిహార్ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై బయటకు రావడాన్ని ఇల్తిజా స్వాగతించారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. కాగా, ఇల్తిజా ముఫ్తీ దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహెరా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story