లాలూ కుమారుడిపై చిరాగ్ సంచలన ఆరోపణలు

by Hajipasha |
లాలూ కుమారుడిపై చిరాగ్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధంపై లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ తనకు తమ్ముడిలాంటి వాడని.. తన తల్లిని ఎవరో మాటలు అంటుంటే అతడు చూస్తుండిపోయాడని తెలిసి తాను చాలా బాధపడినట్లు ఆయన చెప్పుకొచ్చాడు. తన తల్లిని దూషించిన వారిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశానని చిరాగ్ తెలిపారు. ఇండియా టీవీలో జర్నలిస్ట్ రజత్ కుమార్ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ‘‘రాజకీయాలపరంగా నేను లాలూ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నాను. అంతే తప్ప వాళ్లతో నాకు ఎలాంటి వైరం లేదు. మానసికంగా నేను ఇప్పటికీ వాళ్లకు చేరువగానే ఉన్నాను. మా నాన్నకు లాలూతో మంచి సంబంధాలు ఉన్నాయి. మా రెండు కుటుంబాలు చాలా క్లోజ్’’ అని చిరాగ్ వివరించారు.

‘‘రబ్రీ జీ మా అమ్మలాంటిది. మీసా దీదీ మా పెద్దక్క లాంటిది. రోహిణి నా చెల్లెలు లాంటిది. వాళ్ల ఫ్యామిలీతో నాకు ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా మా అమ్మను కొందరు నానా మాటలు అంటుంటే తేజస్వి చూస్తూ కూర్చున్నాడు. అతడి స్థానంలో నేను ఉండి ఉంటే సరైన సమాధానం ఇచ్చి ఉండేవాడిని’’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు. ‘‘నా ముందు ఎవరిని అవమానించినా నేను సహించను’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను ఎన్డీయే కూటమి గెలుస్తుంది. దేశవ్యాప్తంగా కూటమికి 400 సీట్లు వచ్చే అవకాశం ఉంది’’ అని చిరాగ్ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed