International Women's Day: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎంతమందికి తెలుసు?

by D.Reddy |
International Womens Day: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎంతమందికి తెలుసు?
X

దిశ, వెబ్ డెస్క్: సృష్టికి మూలం స్త్రీ. ఓ వ్యక్తి జీవితంలో స్త్రీ చాలా పాత్రలు పోషిస్తుంది. తల్లి, అక్క, చెల్లి, స్నేహితురాలు, భార్య, కూతురు.. ఇలా ఎన్నో బాధ్యతలను ఒక స్త్రీ అలవోకగా పోషిస్తుంది. అలాంటి గొప్ప స్త్రీ మూర్తి నేటికి సమాజంలో అసమానతలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో మహిళలూ వివిధ రంగాల్లో సాధించిన విజయాలు అభినందించేందుకు, లింగ సమానత్వంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day) జరుపుకుంటారు.

మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1909 ఫిబ్రవరి 28న అమెరికాలోని (America) న్యూయార్క్‌లో (Newyork) జరుపుకున్నారు. 1908లో న్యూయార్క్‌లోని ఓ వస్త్ర తయారీ సంస్థలో పని చేసే దాదాపు 15 వేల మంది మహిళా కార్మికులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కి పోరాడి విజయం సాధించారు. ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఆ మరుసటి ఏడాదిలో సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్స వం నిర్వహించింది. అనంతరం ఈ దినోత్సవం ప్రాముఖ్యత తెలిసి 1911లో యూరోపియన్ దేశాలు మహిళా దినోత్సవాన్ని నిర్వహించాయి. అయితే ఇందుకోసం ఒక ప్రత్యేకమైన తేదీ అంటూ నిర్ణయించకపోవడంతో మహిళా దినోత్సవాన్ని ఆయా దేశాలు వేర్వేరు తేదీల్లో నిర్వహించుకుంటూ వచ్చాయి.

1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1977లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సభ్య దేశాలను.. మహిళలు తమ లక్ష్యాలను సాధించడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి సమాజంలో నాయకత్వ పాత్రలను చేపట్టడానికి ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందించేందుకు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఆహ్వానించింది. నాటి నుంచి ప్రతి ఏటా ఏదో ఒక థీమ్‌తో మార్చి 8న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది-2025 మహిళా దినోత్సవాన్ని 'ప్రతి మహిళకూ, ప్రతి బాలికకూ.. హక్కులు, సమానత్వం, సాధికారత (For ALL Women and Girls: Rights. Equality. Empowerment)' అనే థీమ్‌తో జరుపుకోనున్నారు.

నేటీ ఆధునిక యుగంలో మహిళలూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అయినప్పటికీ లింగ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలను వెలుగులోకి తీసుకురావడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలి. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో మహిళల హక్కులను ఇది సమర్థిస్తుంది. మహిళలందరికీ సురక్షితమైన, న్యాయమైన, ప్రగతిశీల భవిష్యత్‌ను నిర్మించేలా మహిళా దినోత్సవం ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి వ్యక్తి తమ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన స్త్రీలకు కృతజ్ఞతలు అదే విధంగా అభినందనలు తెలపండి. దీని వల్ల వారు అందించిన సేవలని మీరు గుర్తించినట్లుగా అవుతుంది. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే.

Next Story