‘నీట్ - యూజీ’ పేపర్‌ను రాకీ ఎలా లీక్ చేశాడంటే..

by Hajipasha |
‘నీట్ - యూజీ’ పేపర్‌ను రాకీ ఎలా లీక్ చేశాడంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక సూత్రధారిని సీబీఐ గురువారం అరెస్టు చేసింది. బిహార్‌లోని నలందకు చెందిన రాకీ అలియాస్ రాకేష్ రంజన్‌ను పాట్నా నగర శివార్లలో అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న సంజీవ్ ముఖియా బంధువే ఈ రాకేష్ రంజన్‌ అని గుర్తించారు. అరెస్టు చేసిన వెంటనే అతడిని పాట్నాలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చగా, 10 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాట్నాతో పాటు కోల్‌కతా (పశ్చిమ బెంగాల్‌)లోని పలు ప్రాంతాల్లో నిర్వహించాయి. ఈ వారం ప్రారంభంలో బిహార్, జార్ఖండ్‌, బెంగాల్‌లోని పలుచోట్ల సోదాలు నిర్వహించిన సీబీఐ పలు కీలక సాక్ష్యాలను సేకరించింది. వాటి ఆధారంగానే రాకీని అరెస్టు చేసినట్లు తెలిసింది. రాకీతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేసిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.

రాంచీలో రెస్టారెంట్ నడుపుతూ..

సీబీఐ వర్గాల కథనం ప్రకారం.. మే 5న నీట్ - యూజీ పరీక్ష జరిగింది. అయితే ఆ తేదీకి రెండురోజుల ముందే జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న ఎస్‌బీఐ బ్యాంకులో ప్రశ్నాపత్రాలను భద్రపరిచారు. అక్కడి నుంచి రెండు సెట్ల పేపర్లు స్థానిక పరీక్ష కేంద్రం అయిన ఒయాసిస్‌ స్కూల్‌కు చేరాయి. ఈ స్కూలుకు ప్రశ్నాపత్రాలు చేరే క్రమంలోనే వాటి సీల్స్ తెరుచుకొని నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకైంది. ప్రశ్నాపత్రం ఇక్కడి నుంచే బిహార్‌లోని పాట్నాలో ఉన్న పేపర్ లీక్ మాఫియాకు చేరి ఉండొచ్చని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రశ్నాపత్రాల సీల్‌ తొలగించిన టైంలో రాకీ (రాకేష్ రంజన్‌) అక్కడే ఉన్నాడని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. రాకీ తన ఫోన్‌తో నీట్-యూజీ ప్రశ్నాపత్రాల ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం ఆ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబులను రెడీ చేయించాడు. అనంతరం వాటిని ఓ మెసేజింగ్ యాప్ ద్వారా బిహార్‌లోని పాట్నా కేంద్రంగా పేపర్ లీక్ కార్యకలాపాలు నిర్వహించే సాల్వర్ గ్యాంగ్‌కు చెందిన చింటూ ఫోనుకు పంపాడు. సాల్వర్ గ్యాంగ్‌ను సంజీవ్ ముఖియా, రవి అత్రి కలిసి నడిపేవారు. సంజీవ్ ముఖియా మేన కోడలు భర్తే చింటూ. అందుకే చింటూ ఫోనుకు నీట్-యూజీ ప్రశ్నాపత్రాలు, వాటి జవాబులను రాకీ చేరవేశాడు. అనంతరం ఆ పేపర్లను సాల్వర్ గ్యాంగ్ లక్షల రూపాయలకు అమ్మేసి సొమ్ము చేసుకుంది. పాట్నాలోని లెర్న్ ప్లే స్కూల్‌ వేదికగా నీట్-యూజీ ప్రశ్నలు, సమాధానాలను విద్యార్థులకు చింటూ షేర్ చేశాడు. రాకీ (రాకేష్ రంజన్‌) బిహార్‌లోని నవాడ గ్రామస్తుడు. అందువల్లే సాల్వర్ గ్యాంగ్‌తో అతడికి సంబంధాలు ఉన్నాయి. రాకీ గత కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఉంటూ ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఈ వ్యవహారంలో జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న ఒయాసిస్ స్కూల్‌ ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ను బుధవారమే అరెస్టు చేశారు. ఈ ముఠాలోని మరో వ్యక్తి, రాకీకి సన్నిహితుడైన సంజీవ్‌ ముఖియా పరారీలో ఉన్నాడు.

రాకీ భార్య ఈమెయిల్ ఐడీ ఐపీ అడ్రస్‌తో..

రాకీ ఆచూకీ కోసం వెతికే క్రమంలో సీబీఐ అధికారులు అతడి భార్య ఈమెయిల్ ఐడీ ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేశారు. దాని ఆధారంగా రాకీ లొకేషన్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతడు ఇంతకుముందు కూడా కొన్ని పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఇద్దరు అనుమానితులైన సన్నీ, రంజిత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. సన్నీ విద్యార్థి కాగా, రంజిత్ ఓ విద్యార్థి తండ్రి. వీరిని విచారించడం వల్లే రాకీ గురించి తెలిసింది. నీట్-యూజీ పరీక్ష అవకతవకల కేసులో ఇప్పటివరకు సీబీఐ ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. బిహార్‌, జార్ఖండ్‌లలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలో పేపర్ లీక్‌ అభియోగాలు ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు నీట్-యూజీ పరీక్ష అభ్యర్థులను మోసగించడంతో ముడిపడి ఉన్నవి.

Advertisement

Next Story

Most Viewed