అర్ధరాత్రి నిమ్మకాయ కోసం.. అంత పనిచేసిన కానిస్టేబుల్ !

by Hajipasha |
అర్ధరాత్రి నిమ్మకాయ కోసం.. అంత పనిచేసిన కానిస్టేబుల్ !
X

దిశ, నేషనల్ బ్యూరో : అరవింద్ కుమార్ (33).. ముంబైలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) కానిస్టేబుల్‌. పక్క ఇంట్లో నివసించే తన సహోద్యోగి ఎలక్షన్‌ డ్యూటీ నిమిత్తం బెంగాల్‌‌కు వెళ్లాడని తెలిసి.. అతడు తప్పుగా ఆలోచించాడు. నేరుగా సహోద్యోగి ఇంటికి వెళ్లాడు. అది కూడా అర్ధరాత్రి టైంలో మద్యం తాగేసి !! ఆ సమయంలో సహోద్యోగి భార్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇంటి తలుపుతట్టి.. ‘‘ఆరోగ్యం బాగా లేదు.. నిమ్మకాయ ఇవ్వండి’’ అని ఆమెను అరవింద్ కుమార్ అడిగాడు. ఈ ఘటన 2021 ఏప్రిల్‌ 19న జరిగింది. అరవింద్ కుమార్‌ను చూసి తలుపు తెరిచిన సహోద్యోగి భార్య.. ‘‘ఇంట్లో నేను నా ఆరేళ్ల కుమార్తెతో తప్ప ఎవరూ లేరు.. భర్త ఇంట్లో లేడు’’ అని చెప్పింది. ఎంతకూ అరవింద్ కదలకపోవడంతో.. ‘‘మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. అరిచి అందరినీ పిలుస్తాను’’ అని ఆమె అల్టిమేటం ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు అరవింద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

క్రమశిక్షణా చర్యలు చేపట్టడంతో..

అనంతరం ఆ మహిళ ఫిర్యాదుపై సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు స్పందించారు. అరవింద్‌ కుమార్‌‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అతడి జీతాన్ని మూడేళ్ల కిందటి స్థాయికి తగ్గించేశారు. ఆ వ్యవధి వరకు అన్ని ఇంక్రిమెంట్లు కట్ చేశారు. అయితే ఈ చర్యలపై బాంబే హైకోర్టును అరవింద్ కుమార్ ఆశ్రయించాడు. తనపై తీసుకున్న చర్యలను, విధించిన జరిమానాలను రద్దు చేయాలని కోర్టును కోరాడు. తాను అస్వస్థతకు గురైనందు వల్లే నిమ్మకాయ కోసం పొరుగింటి తలుపు తట్టానని పిటిషన్‌లో అతడు పేర్కొన్నాడు. ‘‘అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం ఒంటరి మహిళ ఉన్న ఇంటి తలుపు తట్టడం ఓ అధికారి స్థాయి వ్యక్తికి తగదు’’ అని కోర్టు స్పష్టం చేసింది. అతడి ప్రవర్తన నేపథ్యంలో అధికారులు విధించిన జరిమానా రద్దుకు న్యాయస్థానం నో చెప్పింది. అర్ధరాత్రి వేళ పిటిషనర్ రాకపోకల వెనుక ఉద్దేశం ఖచ్చితంగా నిమ్మకాయ కోసమైతే కాదని కోర్టు అభిప్రాయపడింది. మార్చి 11న ఈ మేరకు కోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed