High court: బిడ్లని తల్లికి దూరం చేయడం క్రూరత్వమే.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
High court: బిడ్లని తల్లికి దూరం చేయడం క్రూరత్వమే.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: తల్లి తన పిల్లలను కలవకుండా అడ్డుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ (IPC) ప్రకారం క్రూరత్వమే అవుతుందని బాంబే హైకోర్టు (Bombay High court) తెలిపింది. ఈ మేరకు ఓ మహిళ అత్తమామలపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టు నిరాకరించింది. నాలుగేళ్ల బాలికను తల్లికి దూరంగా ఉంచడం మానసిక హింస, క్రూరత్వానికి సమానమని, అది తల్లి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ విభా కంకన్‌వాడి, రోహిత్ జోషిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ తన అత్తా మామలపై 2022లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో ఈ కేసును రద్దు చేయాలని వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. అత్తమామల ప్రవర్తన ఐపీసీ సెక్షన్ 498-ఏ ప్రకారం క్రూరత్వమని, వేధింపులకు పాల్పడటం కిందకు వస్తుందని తెలిపింది. ఇందులో కోర్టు జోక్యం చేసుకోలేదని, ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. మానసిక వేధింపుల కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది.

కేసు నేపథ్యం?

జల్నా జిల్లాకు చెందిన మహిళకు 2019లో వివాహమైంది. 2020లో ఆమెకు ఓ పాప పుట్టింది. అనంతరం భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం ఆ మహిళను వేధించడం మొదలు పెట్టారు. శారీరకంగా హింసించడంతో పాటు మాటలతో వేధించారు. ఈ క్రమంలోనే 2022లో పాపను తమ వద్దే ఉంచుకుని ఆమెను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపించారు. దీంతో బాధిత మహిళ తన బిడ్డను తనకు అప్పగించాలని కోరుతూ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనంతరం కోర్టు బిడ్డకు తల్లికి ఇవ్వాలని ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులను పాటించకుండా భర్త, అత్త మామలు బిడ్డను తమ వద్దే ఉంచుకున్నారు. ఈ విషయాన్ని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టు ఆర్డర్స్ పాటించని వారికి ఉపశమనం కల్పించలేమని తెలిపింది.

Advertisement

Next Story