Priyanka Gandhi : నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణాలు బలి.. ‘కోచింగ్ సెంటర్’ ఘటనపై ప్రియాంక ఆగ్రహం

by Hajipasha |
Priyanka Gandhi : నిర్లక్ష్యం వల్లే నిండుప్రాణాలు బలి.. ‘కోచింగ్ సెంటర్’ ఘటనపై ప్రియాంక ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో ఉన్న సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరదనీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం, నిర్వహణా లోపం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయని ఆమె మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈమేరకు ప్రియాంకాగాంధీ ఆదివారం ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. ‘‘సివిల్స్ సాధించాలనే సంకల్పంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆశలను ఇలాంటి ఘటనలు చిదిమేస్తున్నాయి’’ అని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను సంబంధిత విభాగాలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

కేరళ విద్యార్థి మృతిపై సీఎం విజయన్ సంతాపం

ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్‌ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. చనిపోయిన వారిలో కేరళలోని ఎర్నాకులంకు చెందిన నివిన్ డాల్విన్ ఉన్నారని ఆయన వెల్లడించారు. నివిన్ డాల్విన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు స్వాతి మలివాల్ పరామర్శ

చనిపోయిన ఇద్దరు సివిల్స్ అభ్యర్థుల కుటుంబాలను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పరామర్శించారు. పోలీసులు వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఆస్పత్రికి చేరుకున్న మలివాల్.. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని ఆమె ప్రకటించారు. ఈవివరాలను ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా సివిల్స్ అభ్యర్థుల మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు.

Advertisement

Next Story