Heavy rains: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

by vinod kumar |
Heavy rains: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతో పాటు వరదలు సంభవించాయి. దీంతో పలు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కుమావోన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల వ్యవధిలోనే కుమావోన్ ప్రాంతంలోని హల్ద్వానీలో 337, నైనిటాల్‌లో 248, చంపావత్‌లో 180, చోర్గాలియాలో 149, రుద్రాపూర్‌లో 127 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 324 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీ బండరాళ్లు, శిథిలాలు పేరుకుపోయాయి. రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా ఈ మార్గాలను తెరిచేందుకు కృషి చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాలు చార్ దామ్ యాత్రపైనా తీవ్ర ప్రభావం చూపాయి. యాత్రకు వెళ్లే మార్గంలో తరచూ రోడ్లు మూతపడుతుండటంతో అంతరాయం కలుగుతోంది.

Advertisement

Next Story