RG Kar case: ఆర్జీ కర్ కేసుపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
RG Kar case: ఆర్జీ కర్ కేసుపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్జీకర్‌ ఘటన (RG Kar case)లో కలకత్తా హైకోర్టు కీలక ప్రకటన చేసింది. ఈ కేసుపై సోమవారం విచారణ జరుపుతామని తెలిపింది. అయితే, అందరి వాదనలు విన్న తర్వాతే ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను పరిగణలోకి తీసుకుంటామని కోర్టు తేల్చి చెప్పింది. దోషి సంజయ్‌ రాయ్‌, సీబీఐ, మృతురాలి కుటుంబ సభ్యుల వాదనలు విన్న తర్వాత ఆ పిటిషన్‌ను స్వీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా.. దోషి సంజయ్‌రాయ్‌కు సిల్దా కోర్టు విధించిన శిక్ష సరిపోదని.. మరణశిక్ష విధించాలంటూ బెంగాల్‌ సర్కారు మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే, బెంగాల్‌ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయడాన్ని సీబీఐ వ్యతిరేకించింది. కేసును విచారించిన సంస్థగా శిక్ష విషయంలో కోర్టుని ఆశ్రయించే హక్కు తమకు మాత్రమే ఉందని.. ఇందులో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది.

తీర్పుపై అసంతృప్తి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్‌ వైద్యవిద్యార్థిని(Kolkata Doctor Murder Case) హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు పడింది. ఈ కేసు అరుదైన కేసు కాదని యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని సిల్దా కోర్టు తీర్పు వెల్లడించింది. బాధితురాలి తల్లిదండ్రులకు రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ కేసులో దోషికి జీవిత ఖైదు పడటంపై అసహనం వ్యక్తం చేస్తూ దీదీ సర్కారు హైకోర్టుని ఆశ్రయించింది.

Next Story

Most Viewed