యువ మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య.. సూట్‌కేసులో శవం

by John Kora |
యువ మహిళా కాంగ్రెస్ నేత దారుణ హత్య.. సూట్‌కేసులో శవం
X

- మృతురాలు హిమానీ నర్వాల్‌గా గుర్తింపు

- పార్టీలోని వారి పనే అని తల్లి ఆరోపణ

- హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో ఘటన

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువ మహిళా కాంగ్రెస్ కార్యకర్త శవం సూట్‌కేసులో లభ్యం కావడం సంచలనం సృష్టించింది. మృతురాలు 22 ఏళ్ల హిమానీ నర్వాల్‌గా గుర్తించారు. కాగా, ఆమెను గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రోహ్‌తక్ జిల్లా సప్లా బస్టాండ్ సమీపంలో ఒక సూట్ కేసులో హిమానీ నర్వాల్ శవం కుక్కి ఉంది. దుండగులు ఆమెను ఎక్కడో హత్య చేసి.. రోహ్‌తక్ జిల్లా సప్లాలో పడేశారు. సూట్‌కేసు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సూట్‌కేసు తెరిచి చూడగా హిమానీ నర్వాల్ మృత దేహం కనిపించింది. వెంటనే ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. హిమానీ నర్వాల్ కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. హిమానీ నర్వాల్‌ వంటి యువ నేతను కోల్పోవడం బాధాకరమని హర్యానా కాంగ్రెస్ పేర్కొంది. హిమానీ హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హర్యానా సర్కార్‌ను కోరింది.

పార్టీలోని వారి పనే : తల్లి ఆరోపణ

తన కూతురును పార్టీలోని వారే హత్య చేసి ఉంటారని హిమానీ తల్లి సవితా నర్వాల్ ఆరోపించారు. రాజకీయంగా తన కూతురి ఎదుగుదల చూసి గతంలో కొంత మంది ఆందోళన చెందారు. నా కూతురు పార్టీ కోసం చాలా త్యాగం చేసింది. పార్టీ పనుల కోసం మా ఇంటికి చాలా మంది వచ్చేవారు. రోజు రోజుకూ నా కూతురు రాజకీయంగా ఎదుగుతుండటంతో కొంత మందికి మింగుడు పడలేదు. వారే ఈ హత్య చేసి ఉండొచ్చని సవితా నర్వాల్ అన్నారు. ఫిబ్రవరి 27న చివరి సారిగా తన కూతురు తనతో మాట్లాడింది, ఆ తర్వాత రోజు కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా నిర్వహిస్తున్న ర్యాలీలో తాను హాజరు కావల్సి ఉంది. తాను కాల్ చేయడానికి ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చిందని సవితా నర్వాల్ పేర్కొన్నారు.

భారత్ జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి శ్రీనగర్ వరకు తన కూతురు కలిసి నడిచింది. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉంది. పార్టీలో స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని అనుకుంది. కానీ కొంత మంది ఆమెను సమస్యల వలయంలోకి నెట్టేశారు. పార్టీలోని సమస్యల గురించి హిమానీ మాట్లాడేది.. సీనియర్ నాయకులతో వాదనలు కూడా చేసేదని సవితా పేర్కొన్నారు. ఏదైనా విషయంలో రాజీ పడాలని సూచిస్తే.. తప్పును తప్పే అని చెప్తాను.. ఒప్పును ఒప్పంటానని తేల్చి చెప్పేదని సవిత తెలిపారు. హిమానీ మృతి తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మా కుటుంబాన్ని పరామర్శించలేదని తల్లి సవిత అన్నారు. దీపిందర్ హుడా మాకు తెలుసు. నేను ఆశా హుడాను కలిశాను. కానీ వారు మాత్రం ఇప్పటి వరకు మాతో మాట్లాడలేదన్నారు. తన కూతురును హత్య చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, హిమానీ హత్య కేసును ఛేదించడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించామని.. త్వరలోనే నిజాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed