బీజేపీ ‘ఫస్ట్ లిస్ట్’ : మాజీ మంత్రి హర్షవర్ధన్, సింగర్ పవన్ సంచలన నిర్ణయాల వెనుక అంత జరిగిందా ?

by Hajipasha |
బీజేపీ ‘ఫస్ట్ లిస్ట్’ : మాజీ మంత్రి హర్షవర్ధన్, సింగర్ పవన్ సంచలన నిర్ణయాల వెనుక అంత జరిగిందా ?
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును విడుదల చేసిన బీజేపీకి ఇద్దరు కీలక నేతలు షాకిచ్చారు. టికెట్ ఇచ్చినా ఒకరు హ్యాండ్ ఇవ్వగా.. టికెట్ ఇవ్వకపోవడంతో మరొకరు ఏకంగా పాలిటిక్స్‌కే గుడ్‌బై చెప్పారు. మాజీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లోక్‌సభ టికెట్‌ను దక్కించుకున్న భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్ కొన్ని కారణాలతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేనని ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి అసన్‌సోల్ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి నిర్ణయం వెనుక దాగిన కొన్ని అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

జాబితాలో పేరు లేకపోవడం బాధించి..

రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇక నుంచి ఢిల్లీ కృష్ణానగర్‌లోని తన క్లినిక్‌లో వైద్యసేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని చాందినీ చౌక్‌ స్థానం నుంచే లోక్‌సభ‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ చాందినీ చౌక్​ నుంచే హర్షవర్ధన్ గెలిచారు. బీజేపీ అధిష్టానం విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల మొదటి జాబితాలో తన పేరు లేకపోవడం బాధించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ‘‘50 ఏళ్ల క్రితం పేదలకు సాయం చేయాలనే ఆశయంతోనే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న జీఎస్‌వీఎమ్‌ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ సూచన మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్ర ఆరోగ్య మంత్రిగా పని చేశాను. పోలియో రహిత భారత్‌ కోసం, కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలను కాపాడేందుకు నా వంతుగా కృషి చేశాను. ప్రధాని మోడీ నాయకత్వంలో పనిచేసినందుకు గర్వంగా ఉంది’’ అని పేర్కొంటూ డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.

30 ఏళ్లుగా రాజకీయాల్లో..

ఈఎన్‌టీ వైద్యుడైన డా.హర్షవర్థన్‌ 1993లో తొలిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. అప్పట్లో ఢిల్లీ ఆరోగ్య, న్యాయశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే స్థానం నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు (1993, 1996, 1998, 2003, 2008, 2013) ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే 2014లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్షవర్థన్‌ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రెండుసార్లు ఆరోగ్యశాఖ బాధ్యతలు చేపట్టారు. 2021లో జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో హర్షవర్ధన్ పదవిని కోల్పోయారు.

పవన్ సింగ్‌ ప్రకటన.. తెర వెనుక అలా..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భోజ్‌పురి సింగర్, నటుడు పవన్ సింగ్‌కు అసన్‌సోల్ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ కేటాయించింది. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన అనౌన్స్ చేశారు. ఇంతకీ ఎందుకిలా చేశారు ? తెర వెనుక ఏం జరిగింది ? అనే దానిపై కొంత సమాచారం బయటికి వచ్చింది. బీజేపీ ఫస్ట్ లిస్టులో పవన్ సింగ్‌కు చోటు దక్కిందని తెలియగానే బెంగాల్‌లోని బీజేపీ నాయకత్వం నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని సమాచారం. పవన్ రూపొందించిన డిస్కోగ్రఫీలో బెంగాలీ మహిళల్ని కించపరిచే పాటలు ఎన్నో ఉన్నాయని, వాటిలో మహిళల్ని అసభ్యంగా చూపించారని బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు పంపారు.కీలకమైన మహిళా ఓటర్లను కించపర్చిన వివాదాస్పద నేపథ్యం కలిగిన పవన్ సింగ్‌కు టికెట్ ఎలా ఇస్తారనే విమర్శలూ వెల్లువెత్తాయి. పవన్‌పై ఉన్న వ్యతిరేకత ప్రభావం బీజేపీపై పడొచ్చనే అంచనాలతో పార్టీ జాతీయ నాయకత్వం అలర్ట్ అయిందని తెలిసింది. అభ్యర్ధిత్వం రద్దుకు సంబంధించిన సమాచారాన్ని పవన్ సింగ్‌కు వ్యక్తిగతంగా తెలియజేశారని సమాచారం. పార్టీ సూచన మేరకే.. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్వయంగా ప్రకటన చేశారని అంటున్నారు. పవన్ స్థానంలో ఎవరిని అసన్‌సోల్ నుంచి రంగంలోకి దింపనున్నారు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.

Advertisement

Next Story

Most Viewed