Gujarath Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by vinod kumar |
Gujarath Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: గత రెండు రోజులుగా గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా నవ్సారీ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో అత్యధికంగా 527 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. పూర్ణ, కావేరీ నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బిలిమోరా నగర్ పాలికా నుంచి 102 మందిని తరలించినట్టు జిల్లా కలెక్టర్ క్షిప్ర ఎస్ అగ్రే తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం వరకు వర్షాలు కొనసాగే చాన్స్ ఉందని తెలిపింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దక్షిణ గుజరాత్‌లోని వల్సాద్, తాపి, నవ్‌సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని సీఎంఓ కార్యాలయం తెలిపింది. దక్షిణ గుజరాత్ జిల్లాలైన వడోదర, సూరత్, బరూచ్, నవ్‌సారి, వల్సాద్, అలాగే అమ్రేలి మరియు భావ్‌నగర్‌లలో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయవడంతో పాటు ట్రాఫిక్‌కు సైతం తీవ్ర అంతరాయం కలిగింది.

Advertisement

Next Story

Most Viewed