హర్యానా అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ

by Harish |
హర్యానా అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ బండారు దత్తాత్రేయ
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. దీనికి సంబంధించి రాజ్‌భవన్ నుంచి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అంతకుముందు బుధవారం, ముఖ్యమంత్రి నయాబ్ సైనీ నేతృత్వంలోని మంత్రి మండలి అసెంబ్లీని సెప్టెంబరు 13 నుంచి రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. ఈ మేరకు గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది వెంటనే అమల్లోకి వచ్చేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీని రద్దు చేసిన నేపథ్యంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు మంత్రిమండలికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రాష్ట్రంలో చివరి అసెంబ్లీ సమావేశాలు మార్చి 13న జరిగాయి. రాజ్యాంగం ప్రకారం, అసెంబ్లీ చివరి సమావేశం నుండి ఆరు నెలల వ్యవధి ముగిసేలోపు రాష్ట్ర శాసనసభ సమావేశాన్ని నిర్వహించాలి. హర్యానాలో, గత సమావేశాల నుండి ఆరు నెలల వ్యవధి గురువారంతో ముగిసింది. అక్టోబరు 5న హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 90 స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న భారత ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుంది. గెలిచే పార్టీ లేదా కూటమి తదుపరి అసెంబ్లీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

Advertisement

Next Story

Most Viewed