Army: చైనా కాంపోనెంట్స్ వాడుతున్న కంపెనీలతో డీల్ రద్దు..!

by Shamantha N |
Army: చైనా కాంపోనెంట్స్ వాడుతున్న కంపెనీలతో డీల్ రద్దు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: సాయుధ దళాలకు(Armed forces) సరఫరా చేస్తున్న డ్రోన్లలో చైనా తయారీ విడిభాగాలను(Chinese components) వాడుతున్న కంపెనీలపై కేంద్రం చర్యలకు సిద్ధమైంది. చైనీస్ కాంపోనెంట్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. కాగా.. బీజింగ్‌ నుంచి దిగుమతి చేసుకొన్న పార్ట్‌లను వాడుతున్నట్లు గుర్తించిన కంపెనీలకు కేటాయించిన 3 కాంట్రాక్టులను రద్దు చేసుకొంది. సాయుధ దళాల రవాణా అవసరాల నిమిత్తం మొత్తం 400 డ్రోన్లను(400 logistics drones by the Army) తయారుచేయాల్సి ఉంది. అయితే, ఆ కాంట్రాక్టునే కేంద్రం రద్దు చేసింది. ప్రస్తుతం రద్దు చేసిన కాంట్రాక్టులో 200 మీడియం ఆల్టిట్యూడ్‌ డ్రోన్లు, 100 హెవీ వెయిట్‌ లాజిస్టిక్స్‌ డ్రోన్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ.230 కోట్లు. కాగా.. 2023లో అత్యవసర వినియోగం కోసం చెన్నైకి చెందిన ఓ కంపెనీతో వీటికి సంబంధించిన కాంట్రాక్టుపై సైన్యం సంతకం చేసింది. ఇప్పటికే రక్షణరంగంలో వాడే డ్రోన్లలో చైనా విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ వాడకుండా పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది.

రక్షణశాఖ ప్రకటన

మరోవైపు, ఒప్పందం ప్రకారం తయారు చేయాల్సిన ఈ డ్రోన్లను ప్రాథమికంగా చైనాతో 3,488 కిలోమీటర్ల మేరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంట మోహరించనున్నారు. ‘‘దురదృష్టవశాత్తు కొన్ని స్వదేశీ కంపెనీలు కొన్ని విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకొని సైన్యం కోసం తయారుచేసే డ్రోన్లలో వాడుతున్నాయి. ఇది సైబర్‌ సెక్యూరిటీకి, డేటా రక్షణకు ముప్పుగా మారనుంది. అంతేకాకుండా, సాయుధ దళాల కార్యకలాపాల్లో గోప్యత కూడా లేకుండా పోతుంది. శత్రువులు జూమింగ్‌ సాయంతో మన డ్రోన్లను సీజ్‌.. లేదా సాఫ్ట్‌ కిల్‌ చేయగలుగుతారు. అంతేకాదు వారు వాడే ఎలక్ట్రానిక్స్‌లో బ్యాక్‌డోర్‌ కూడా ఉండే అవకాశం ఉంది. అవి మన సెక్యూరిటీ ప్రొటెక్షన్లను బైపాస్‌ చేయగలవు’’ అని రక్షణశాఖ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నిఘా, పహారా మిషన్ల సమయంలో కొన్ని డ్రోన్లు విఫలం కావడంతో.. అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. గతేడాది ఆగస్టులో రాజౌరీ సెక్టార్‌లో మోహరించిన ఇన్‌ఫాంట్రీ దళం కొన్ని డ్రోన్లను ప్రయోగించగా అవి దారి మళ్లి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కూలాయి. ఆ ఘటనపై దర్యాప్తు చేయగా.. దానిలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. భారతసైన్యం ఆ కంపెనీకి సంబంధించిన 180 డ్రోన్లను వాడుతోంది. దీంతో రక్షణశాఖ, సైన్యం డ్రోన్ల తయారీ, సర్టిఫికేషన్‌పై దృష్టిసారించింది. దీనికితోడు ఎఫ్ఐసీసీఐ(FICCI), సీఐఐ(CII) వంటి సంస్థలను కూడా అప్రమత్తం చేసింది. చైనాతో సైనిక ప్రతిష్టంభనతో సాయుధ దళాలు విస్తృత శ్రేణి డ్రోన్ల సేకరిస్తున్నాయి. వీటిలో నానో, మినీ, మైక్రో డ్రోన్‌ల నుండి కామికేజ్, లాజిస్టిక్స్, సాయుధ స్వార్మ్‌లు సహా ఫైటర్-సైజ్ డ్రోన్లు ఉన్నాయి.

Next Story

Most Viewed