ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఫిక్స్

by Mahesh |
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఫిక్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్​ ఖాతాల్లో ఉండే సొమ్ముపై ఇచ్చే వడ్డీరేటు ఖరారైంది. 2021-22 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధిపై 8.10 శాతం వడ్డీ రేటును ఇవ్వగా...2022-23 సంవత్సరానికి గాను 8.15 శాతానికి వడ్డీ రేటును పెంచుతూ ట్రస్టీల బోర్డు నిర్ణయించింది. మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

2021-22 తో పోల్చితే ఇది 0.05శాతం అధికం. ఈపీఎఫ్ డిపాజిట్ల వడ్డీ రేట్లపై సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ (సీబీటీ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపించనున్నారు. దీనిని కేంద్ర ఆర్థికశాఖ ఆమోదిస్తే వడ్డీ రేటు అమలవుతుంది. అందుకు అనుగుణంగా 5 కోట్ల ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లోకి వడ్డీ జమ చేస్తారు.

గత ఏడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 2.50 శాతం మేర పెంచడంతో...బ్యాంకులు డిపాజిట్లు, రుణాల రేట్లను పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో స్వల్పంగా వడ్డీ రేటును పెంచినట్లు తెలుస్తోంది. కాగా, ఈపీఎఫ్​పై ఈసారి వడ్డీ రేటు పెంచాలని కార్మిక సంఘాలు ఇది వరకే డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు సీబీటీ సమావేశంలోనూ తమ గళాన్ని వినిపించాయి.

వడ్డీ రేటుతో పాటు తమ సమస్యలపై కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశంలోను మాట్లాడారు. అయితే, వీటికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయడం లేదని కార్మిక శాఖ, ఈపీఎఫ్ఓ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అధిక పింఛనుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా అమలు చేస్తున్నామని, ఏమైనా మార్పులు చేస్తే తీర్పు ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed