‘గాంధీ శాంతి బహుమతి’పై వివాదం

by Javid Pasha |
‘గాంధీ శాంతి బహుమతి’పై వివాదం
X

న్యూఢిల్లీ : గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్‌ కు గాంధీ శాంతి బహుమతిని ప్రకటించడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. గీతా ప్రెస్‌ కు ఈ అవార్డును ఇవ్వడమంటే .. సావర్కర్, గాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే వారసత్వానికి ఇచ్చినట్టేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. "గీతా ప్రెస్‌ అండ్ ది మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియా" టైటిల్ తో జర్నలిస్ట్ అక్షయ ముకుల్ 2015లో రిలీజ్ చేసిన బుక్ లో.. గాంధీజీకి, గీతా ప్రెస్ కు మధ్య భావజాలంపరంగా నడిచిన వైరుధ్యాలను ప్రస్తావించారని చెప్పారు. గాంధీజీ రాజకీయ, మత, సామాజిక ఎజెండాకు వ్యతిరేకంగా గీతా ప్రెస్ నడుచుకునేదనే విషయాన్ని కూడా పుస్తకంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు పలువురు బీజేపీ ముఖ్య నాయకులు కౌంటర్ ఇచ్చారు.

"గీతా ప్రెస్ అనేది భారతదేశ సంస్కృతితో, హిందూ విశ్వాసాలతో ముడిపడి ఉంది. ముస్లిం లీగ్ సెక్యులర్ అని చెప్పేవాళ్లు ఇలాంటి ఆరోపణలే చేస్తుంటారు" అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. "కర్ణాటకలో విజయంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భారతదేశ నాగరిక విలువలు, వారసత్వానికి వ్యతిరేకంగా బహిరంగ యుద్ధాన్ని ప్రారంభించింది. అది మతమార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయడం రూపంలో కావచ్చు.. గీతా ప్రెస్‌పై విమర్శల రూపంలో కావచ్చు. భారత ప్రజలు ఈ దూకుడును ప్రతిఘటిస్తారు" అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ట్వీట్ చేశారు.

గీతా ప్రెస్‌ కృషికి గుర్తింపుగానే ఈ అవార్డు : అమిత్ షా

"సనాతన సంస్కృతి, గ్రంథాలను ఈరోజు మనం సులభంగా చదవగలుగుతున్నామంటే అందుకు కారణం గీతా ప్రెస్ వెలకట్టలేని కృషి" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్‌ గత వందేళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపుగానే గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు.

రూ.కోటి వేరే చోట ఖర్చు చేయండి : గీతాప్రెస్‌

గాంధీ శాంతి బహుమతికి ఎంపికవడాన్ని గౌరవప్రదమైన విషయంగా భావిస్తున్నామని గీతాప్రెస్‌ ట్రస్టీ బోర్డు పేర్కొంది. సంస్థకు విరాళాలు స్వీకరించకూడదనేది తమ సూత్రమని.. అందుకే అవార్డుతో పాటు ఇచ్చే రూ.కోటి రివార్డును తీసుకోకూడదని నిర్ణయించినట్లు తెలిపింది. ఆ మొత్తాన్ని వేరే చోట ఖర్చు చేయాలని కేంద్రాన్ని కోరింది. గీతాప్రెస్‌కు ఈ అవార్డును ఇవ్వడంపై వివాదం నెలకొన్న తరుణంలో ఆ సంస్థ నుంచి ఈమేరకు ప్రకటన వెలువడటం గమనార్హం.


Advertisement

Next Story

Most Viewed