నాగ్‌పూర్‌కు నితిన్ గడ్కరీ సొంత మేనిఫెస్టో.. లక్ష ఉద్యోగాల హామీ

by S Gopi |
నాగ్‌పూర్‌కు నితిన్ గడ్కరీ సొంత మేనిఫెస్టో.. లక్ష ఉద్యోగాల హామీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నితిన్ గడ్కరీ మంగళవారం తన సొంత మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో లక్షల ఉద్యోగాలతో పాటు అభివృద్ధి, పరిశుభ్రత పరంగా దేశంలోనే మొదటి ఐదు నగరాల్లో నాగ్‌పూర్‌ను చేర్చనున్నట్టు హామీ ఇచ్చారు. ఇదే సందర్భంగా గత ఐదేళ్లలో తాను ఎంపీగా చేసిన పనులను గడ్కరీ వివరించారు. మురికివాడల నివాసితులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు, కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. నగరంలోని స్లమ్ ఏరియాల్లో ఒక దానిలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని, 500 నుంచి 600 ఇళ్లకు యాజమాన్య హక్కులు కల్పించామని మంత్రి పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 100 ఉద్యానవనాలు వస్తాయని, వాటిలో ఇప్పటికే ఉన్నవాటిని పునరుద్ధరిస్తామన్నారు. అంతేకాకుండా రైతులు, ధాన్యం హోల్‌సేల్ వ్యాపారులు, నూనె వ్యాపారుల కోసం ప్రత్యేక ప్రదేశాల్లో ఆధునిక మార్కెట్లు వస్తాయని, ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ చొరవ దోహదపడుతుందని గడ్కరీ వివరించారు. ఇవి కాకుండా మెట్రో గేజ్ లేన్, కొత్త ఫోర్-లేన్ రైల్వే ట్రాక్‌లు, లాజిస్టిక్ పార్కులు, 2070 నాటికి నీటి కొరతకు పరిష్కారం, విధర్భ ప్రాంతంలో ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story